ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

Update: 2024-12-04 13:56 GMT

దిశ, మంచిర్యాల : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వెంకటపూర్ గ్రామం పుట్టవాడకు చెందిన పుట్ట శ్రీకాంత్ అనే యువకుడు కన్నెపల్లి మండలం ఐయితపెల్లి గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పరచుకొని గత రెండు సంవత్సరాలుగా ప్రేమించాడు. ఈ క్రమంలో యువతి గర్భవతి అయింది. దాంతో గుట్టు చప్పుడు కాకుండా టాబ్లెట్స్ ఇచ్చి గర్భం పోయేలా చేశాడు. అందుకు రూ.20 లక్షలు ఇచ్చి ఆమెను వదిలించుకోవాలని చూశారు. అందుకు ఆమె ఒప్పుకోకుండా గత నెలలో రెండుసార్లు వెంకటాపూర్ గ్రామానికి రాగా యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

    దీంతో ఆమె ఇంటిముందు బైఠాయించింది. యువకుని బాబాయి పుట్ట అశోక్ జోక్యం చేసుకొని కులం పేరుతో తిడుతూ చంపుతా అంటూ బెదిరిస్తున్నాడు. అయినా 20 రోజులుగా యువకుని ఇంటి ముందు ఆందోళన చేస్తుంది. విషయం తెలుసుకున్న కన్నేపల్లి ఎస్సై యువకుని ఇంటి వద్దకు వచ్చి బాధితురాలిని అక్కడి నుండి పంపించాడు. మరుసటి రోజు జిల్లా సఖి కేంద్రం నిర్వాహకులు గ్రామానికి రావడంతో పెద్దమనుషుల సమక్షంలో యువకునితో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ క్రమంలో గత నెల 16వ తేదీన గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఒప్పకున్నాడు. తరువాత పెళ్లి ఏర్పాట్లు చేయగా యువకుడు తాళి కట్టేందుకు సిద్ధం కాగా ఆయన బాబాయి పెళ్లి చెడగొట్టాడు. ఈ విషయంలో ఎస్సై ఆదేశాలను కూడా యువకుని కుటుంబ సభ్యులు లెక్క చేయలేదు. నిందితుడికి మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుని అండదండలు ఉన్నట్టు తెలిసింది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితురాలు పేర్కొంది. 


Similar News