ప్రాణహిత ప్రాజెక్టును వార్దా నది వద్ద నిర్మిస్తాం
ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును వార్దా నది వద్ద నిర్మిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విటల్ అన్నారు.
దిశ, బెజ్జూర్ : ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును వార్దా నది వద్ద నిర్మిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విటల్ అన్నారు. బుధవారం బెజ్జూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కేంద్రం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎమ్మెల్యే కృషి చేయాలని సూచించారు. దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, యువతను ప్రోత్సహించేందుకు ఇప్పటికే 55 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళలకు పెద్దపీట వేసినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల లోపు రుణాలు రుణమాఫీ చేశారని, త్వరలో అందరికీ రుణమాఫీ వర్తింప చేస్తామని తెలిపారు. అనంతరం సిరిపుర్ టీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వయి హరీష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేక నిధులకు ఇబ్బంది అవుతుందన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంనిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు నిర్మిస్తే కేంద్రం నుంచి 60 శాతం నిధులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్సీతో కలిసి ముఖ్యమంత్రిని అడుగుతామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాణహిత ప్రాజెక్టు నిధుల విషయం నిలదీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ గౌరీ శంకర్, పీఏసీఎస్ చైర్మన్ ఓం ప్రకాష్, మాజీ ఎంపీపీ డబ్బులు నానయ్య, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, మాజీ సర్పంచ్ జగ్గా గౌడ్, కాంగ్రెస్ నాయకులు నాహీర్ అలీ, సామల రాజన్న, భూష శంకర్, బీజేపీ నాయకులు బాలకృష్ణ, సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.