అప్పుడు ఏనుగు.. ఇప్పుడు పులులు..

వన్యప్రాణుల దాడుల్లో వరుసగా రైతుల బలవుతున్నారు. మరీ ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పరిధి ఫారెస్ట్ రేంజ్లో అధికంగా ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2024-12-02 02:56 GMT

దిశ, ఆసిఫాబాద్ : వన్యప్రాణుల దాడుల్లో వరుసగా రైతుల బలవుతున్నారు. మరీ ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పరిధి ఫారెస్ట్ రేంజ్లో అధికంగా ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏనుగు దాడుల్లో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ విషయం మరువకముందే తాజాగా ఇప్పుడు పులి దాడిలో ఓ మహిళ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అటవీ శాఖ అధికారులు పులిని ట్రాకింగ్ చేస్తూనే ప్రజలను పులి దాడి నుంచి రక్షించేందుకు అధికారులు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన పులి కాగజ్ నగర్ మండలం బెంగాలీ క్యాంప్ ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన మొర్లే లక్ష్మీ పై పులి దాడి చేసి హతమార్చింది. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడలో రౌతే సురేష్పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. 24 గంటల్లోనే ఇద్దరి పై పులి దాడి చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సమీప గ్రామాల్లో తిరుగుతుండటంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆ ప్రాంతం ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు.

నెల వ్యవధిలో పది చోట్ల..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా పులుల సంఖ్యతో పాటు సంచారం పెరిగినట్లు తెలుస్తోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలో పది చోట్ల పులి సంచారాన్ని ప్రజలు గుర్తించారు. నవంబర్ 4న కుంటాలలో ఒక ఎద్దు, గేదేను దాడిచేసి చంపేసింది. 10న కాసిపేటలో పెద్దపులి, చిరుతపులి సంచారాన్ని ఒకే రోజు స్థానికులు గుర్తించారు. 15న నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పులి దాడి చేసి ఎద్దును హతమార్చింది. 17న ఉట్నూర్ లో ఎద్దు పై దాడి చేసింది. 18, 19 న జోడేఘాట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జైన్నుర్ మండలం రాసిమేట్ట అటవీ ప్రాంతంలో పులి దాడిలో మృతి చెందిన రెండు ఆవుల కళేబరాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. 23న దాబా గ్రామంలోని కోర్ డోబ్రాలోదిలో మేతకు వెళ్లిన పశువుల మంద పై దాడి చేసి ఐదు పశువులను గాయపరిచింది. 25, 26న గోయగాం అటవీ ప్రాంతంలో వరుసగా రెండు స్థానిక ప్రజలు కనిపించింది. 27న మళ్లీ దాబా అటవీ ప్రాంతంలో పులి గాండ్రింపులతో కూడిన కేకలు వినిపించినట్లు స్థానిక తెలిపారు. మరుసటి రోజు 28న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలై సోనాపూర్ కోస్టారా అటవీ ప్రాంతంలో ఆవుదూడను పులి హతమార్చింది. 29న బోథ్ బాబేర తండాలో మేకల మందపై చిరుతపులి దాడిచేసి మూడు గొర్రెలు. ఒక మేకను చంపేసింది. 29న కాగజ్ నగర్ బెంగాలీ క్యాంప్ లో లక్ష్మీ, 30న సురేష్ లపై దాడి చెసింది.

పులి జాడ కోసం జల్లెడ..

పులి దాడితో అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు ఇప్పటికే 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించింది. ఇస్గాం, నజ్రుల్ నగర్, సితనగర్, అనుకోడా, గన్నారం, ఆరెగూడ, కడంబా గ్రామాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూలీలకు పనులకు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించింది. మరోవైపు పులి జాడ కోసం అటవీ అధికారులు డ్రోన్ల సాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అయితే జిల్లా పరిధిలో ఎన్ని పులులు తిరుగుతున్నాయి. అనే దానిపై అటవీ శాఖ అధికారులు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

ఎట్టకేలకు పులి జాడ లభ్యం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 24 గంటల వ్యవధిలో పులి ఇద్దరి పై దాడి చేసి గన్నారంకు చెందిన లక్ష్మీ హతమార్చాగా. సిర్పూర్ టీ దుబ్బగూడ లో రౌతే సురేష్ పై దాడి చేసింది. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు గత 12 గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు డ్రోన్ కెమెరాల సాయంతో పులి ట్రాకింగ్ చేశారు. సిర్పూర్ మండలంలోని ఇటిక్యాల పహాడ్ సమీపంలోని వాగు వద్ద పులి సంచిరిస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి కదలికల పై నిఘా పెట్టారు. పులి మహారాష్ట్ర సరిహద్దు వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

పులి ట్రాకింగ్ కోసం 45 డ్రోన్ కెమెరాలు. 100 మంది ట్రాకర్స్ లను ఇందులో కోసం వినియోగించారు. దీన్ని పీసీసీఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ విల్లు సింగ్ మేర్, సీసీ ఎఫ్ శాంతారాం ఆధ్వర్యంలో చేపట్టారు. అంతకు ముందు ఇటిక్యాల పహాడ్ గ్రామంలో వారు సందర్శించి పులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ గ్రామస్థులకు ఫేస్ మాస్క్ లు పంపిణీ చేశారు. వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో పులి వెనుక నుంచి దాడి చేస్తోందని. రైతులు పనులు వెళ్లినప్పుడు తల వెనుక భాగంలో మాస్క్ పెట్టుకుంటే పులి దాడి నుంచి కొంతమేరకు రక్షణగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. పులి సంచారం తగ్గే వరకు ఎవరు వ్యవసాయ పనులకు వెళ్లోద్దని సూచించారు.


Similar News