విధులపై కనీస అవగాహన లేకుంటే ఎలా...?

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఒక్కొక్క విద్యార్థికి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రతిరోజు ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడీ సిబ్బందిని ప్రశ్నించారు.

Update: 2024-03-22 10:35 GMT

దిశ , లోకేశ్వరం: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఒక్కొక్క విద్యార్థికి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రతిరోజు ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడీ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అంగన్వాడీ సీడీపీఓతో పాటు సిబ్బంది సైతం సమాధానం చెప్పకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ విధులపై కనీస అవగాహన లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన లోకేశ్వరం మండలంలో సుడిగాలి పర్యటన చేసి అంతర్ జిల్లా చెక్ పోస్ట్, పోలింగ్ బూత్‌లు, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు.

వివరాలు సక్రమంగా నమోదు చేయకుంటే చర్యలు..

ముందుగా లోకేశ్వరం మండల కేంద్రంలో గల అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించగా కేవలం ఎనిమిది మంది విద్యార్థులు హాజరైనట్లు హాజరు పట్టికలో నమోదు చేసి ఉంది. గురువారం ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రశ్నించగా 12 మంది విద్యార్థులు హాజరయ్యారని సిబ్బంది తెలిపారు. నిన్నటికి ఈ రోజుకు నలుగురు విద్యార్థులు గైర్హాజరు ఎందుకయ్యారని వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా అని ప్రశ్నించగా.. నిన్న హాజరైన విద్యార్థుల ఫోటో ఉందని సిబ్బంది చెప్పడంతో ఫోటోలు చూపించాలని అన్నారు.

మొబైల్ ఫోన్లో ఉన్న ఫోటోను చూపించగా కలెక్టర్ పరిశీలించి తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుందని ఇలా తప్పుడు వివరాలు ఎందుకు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

ఉన్నత పాఠశాలలో అపరిశుభ్రత పై ఆగ్రహం…

లోకేశ్వరం మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌ను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను గమనించి ఎన్ని రోజులకు ఒకసారి పరిసరాలను శుభ్రం చేస్తారని సిబ్బందిని ప్రశ్నించారు. గత మూడు రోజుల క్రితమే పరిసరాలను శుభ్రం చేశామని సిబ్బంది తెలపడంతో రెండు నెలల క్రితం నిర్వహించిన గణతంత్ర వేడుకల సమయంలో ఏర్పాటు చేసిన జెండాలు చెదలు పట్టి ఉన్నాయని, మూడు రోజుల క్రితం శుభ్రం చేస్తే ఇవి ఇలా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్లో ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.

మొక్కుబడిగా తనిఖీలను చేపట్టవద్దు…



అనంతరం పంచగుడి వద్ద ఏర్పాటుచేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్‌ను సందర్శించి వాహనాల తనిఖీలను మొక్కుబడిగా చేపట్టవద్దని సిబ్బందికి సూచించారు. చెక్ పోస్ట్‌లోని సిబ్బంది ఎల్లవేళలా అలర్ట్‌గా ఉండాలని, ఎన్నికలు సజావుగా ముగిసేందుకు సహకరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి పరిసరాలను పరిశీలించి ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పక్కనే గల హరితహారం నర్సరీని పరిశీలించి మొక్కలు తక్కువగా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించగా కోతులు ధ్వంసం చేస్తున్నాయని ఈజీఎస్ సిబ్బంది తెలిపారు. ఆయనతోపాటు బైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్ మోతి రాం, ఎంపీడీవో సాల్మన్ రాజు, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీమతి, సూపర్వైజర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Similar News