దాబాలో హైటెన్షన్

వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థిని శైలజ మృతితో మండలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Update: 2024-11-26 12:26 GMT

దిశ, వాంకిడి : వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థిని శైలజ మృతితో మండలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో శైలజ మృతదేహాన్ని అంబులెన్స్ లో మండలంలోని దాబాకు తరలించారు. గ్రామానికి చేరుకున్న అంబులెన్స్ ను స్థానిక గ్రామస్తులు చుట్టుముట్టి అడ్డుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని అంబులెన్స్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ గ్రామానికి చేరుకుని మంత్రి సీతక్కతో మాట్లాడి డిమాండ్లను పరిష్కరిస్తామని తల్లిదండ్రులు, గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. అప్పుడే బాలిక కుటుంబాన్ని ఓదార్చేందుకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు వచ్చారు.

     దాంతో పోలీసులను తప్పించుకొని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు వివిధ మార్గాల ద్వారా విద్యార్థిని శైలజ ఇంటికి చేరుకుని మృతదేహంతో ఇంటిముందు బైఠాయించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెళ్లిపోగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులో తీసున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ దండే విఠల్ తక్షణ సహాయం కింద రూ.లక్ష 20 వేలు, రెండు ఎకరాల భూమి, ఇంట్లో ఒకరికి ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు అంత్యక్రియలు చేసేందుకు ఒప్పుకున్నారు. నాలుగు గంటల నాటకీయ పరిణామాల మధ్య శైలజ అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు మీడియా ప్రతినిధులు గ్రామానికి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

పోలీస్ పహారాలో వాంకిడి

శైలజ మృతితో జైన్నూర్ తరహాలో అల్లర్లు జరగొచ్చని భావించి పోలీస్ అధికారులు అప్రమత్తమై ముందస్తుగా వాంకిడి ఆశ్రమ పాఠశాల పరిసరాలతో పాటు సావాతి, దాబా గ్రామానికి వెళ్లే అన్నిదారుల్లో రాకపోకలను నిలిపివేశారు. మీడియాతో పాటు సామాన్య ప్రజలను సైతం అటుగా అనుమతించడం లేదు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్స్ ఆలం ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 


Similar News