మునుగోడు వైపే అందరి చూపు
ఏ నోట విన్నా మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది.
దిశ, లక్షెట్టిపేట : ఎక్కడ చూసినా..ఏ నోట విన్నా మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారనే దానిపై అంచనాలు, విశ్లేషణలతో జిల్లా అంతటా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో తమ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్, బీజేపి నుంచి కీలక నేతలు అక్కడ తమకు ప్రచార బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లో తమ తమ అభ్యర్థుల గెలుపునకు మకాం వేశారు. గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. అక్కడ ప్రచారంలో మంచిర్యాల జిల్లా నేతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
మకాం వేసిన జిల్లా నేతలు..
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కుసుమ కుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉండగా బీజేపి అభ్యర్థిగా బరిలో రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. వారి తరఫున జిల్లా నుంచి ఆయా పార్టీల ఎమ్మెల్యే స్థాయి నాయకులు, కీలక నేతలు తమ తమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి జిల్లా నుంచి ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపి అభ్యర్థి తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు అక్కడ ప్రచారం చేస్తున్నారు. తమకు బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లో ఓటర్లను కలుస్తూనే, వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సెమీ ఫైనల్ గా భావిస్తున్న ప్రధాన పార్టీలు..
వచ్చే యేడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు మునుగోడు ఉపఎన్నికను సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని ఊపు మీదున్న బీజేపి ఈ ఎన్నికలోనూ తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని పట్టుదలతో ఉంది. తద్వారా టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ తామే ఇచ్చి పవర్ ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని తెలంగాణలో తమ పవర్ తగ్గదేలేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. రెండు మూడు వేల ఓటర్లకు ఒకరి చొప్పున ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కీలక నేతలకు పార్టీ అధిష్టానం ప్రచార బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ సీటింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తున్నది.
కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చరిష్మా పై అక్కడ పార్టీ కేడర్ ఆధారపడి ప్రచారం ముమ్మరం చేసింది. ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగి సభలు, సమావేశాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు కుల సంఘాలను, యువతను, ఇతర పార్టీల్లోని నాయకులను, ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకునేందుకు నజరానాలు ఇచ్చేందుకు ఇప్పటికే తెర లేపినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా జిల్లాలో ఏ పాన్ డబ్బా వద్దనైనా, హోటల్లు, దుకాణాల వద్ద, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కలుసుకున్నచోట ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ నడుస్తున్నది. పదిమంది కలిసినచోట ఈ చర్చ ఆసక్తిని రేపుతోంది. వచ్చే నెల 3న పోలింగ్ జరిగి, కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇక్కడి నేతల ప్రచారం అక్కడ అభ్యర్థుల విషయంలో ఏ మేరకు ఫలించాయో ఫలితాలు వెల్లడిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.