నేడు కేటీఆర్ రాక.. గులాబీమయమైన నిర్మల్
భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిర్మల్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు.
దిశ ప్రతినిధి, నిర్మల్: భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిర్మల్ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసేందుకు వస్తున్న కేటీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా అన్ని దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వస్తున్న మంత్రి కేటీఆర్ నేరుగా నిర్మల్ చేరుకుంటారు. అక్కడి నుంచి సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం అక్కడి నుంచి దిలావర్పూర్ మండలం లో కాలేశ్వరం ప్రాజెక్ట్ 27, 28 ప్యాకేజీ ఎత్తిపోతల పనులను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ కార్యాలయం పక్కన నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ ను శిలా ఫలకాలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
పట్టణం గులాబీ మయం...
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్మల్ పట్టణం అంతా గులాబీమయమైంది. మంచిర్యాల చౌరస్తా నుంచి బైల్ బజార్ దాకా గులాబీ జెండాలతో ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల చౌరస్తా, పాత కలెక్టర్ చౌరస్తా, వివేకానంద చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, బైల్ బజార్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గులాబీ జెండాలతో గులాబీ మయం చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనులకు హామీలు ఇవ్వడంతో పాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు విషయంలో సందేశం ఇచ్చేందుకు పార్టీ దిశానిర్దేశం చేస్తుంది.