tiger : కుంటాల మండలంలో పెద్దపులి సంచారం

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం కుంటాల మండలం సూర్యపూర్, మేదన్ పూర్, అంబుగాం,పెంగళ్ పహాడ్ ఫారెస్ట్ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని గత మూడు రోజులుగా వస్తున్న వార్తలు నిజమని ఆదివారం భైంసా ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు.

Update: 2024-11-03 09:15 GMT

దిశ, భైంసా : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం కుంటాల మండలం సూర్యపూర్, మేదన్ పూర్, అంబుగాం,పెంగళ్ పహాడ్ ఫారెస్ట్ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని గత మూడు రోజులుగా వస్తున్న వార్తలు నిజమని ఆదివారం భైంసా ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. గత రెండు రోజుల క్రితం కుంటాల మండలం సూర్యాపూర్ గ్రామానికి చెందిన ఒడ్డే సాయన్న అనే రైతుకి చెందిన ఎద్దుపై ,అలాగే అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతుకి చెందిన గేదెపై పెద్దపులి ఎటాక్ చేసింది. ఎద్దు అదే రోజు అక్కడికక్కడే చనిపోగా, చికిత్స పొందుతూ ఆదివారం గేదె మృతి చెందింది.

    మొదటగా పెద్దపులిని చూసిన గేదెల కాపరి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా భయాందోళనకు గురైన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి పులి అడుగులను పరిశీలించారు. ట్రాక్ కెమెరాలు అమర్చి పులి సంచరిస్తున్న కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పులి తిరుగుతుందన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : భైంసా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్

ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి. పశువుల, మేకల కాపరులు, వ్యవసాయ పనులు చేసే రైతులు తమ విధుల్లో ఉన్నప్పుడు శబ్దాలు చేస్తూ గుంపులుగా ఉండాలి. డీఫ్ ఫారెస్ట్ లోకి వెళ్లకండి. పెద్దపులి అలికిడికి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే సమాచారం అందించాలి. ఫారెస్ట్ సిబ్బంది మూడు బృందాలుగా విడిపోయి పెద్దపులి సంచారంపై నిఘా పెంచింది. ఎద్దు, గేదెను నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తాం. 

Tags:    

Similar News