గంజాయి మత్తులో యువత చిత్తు..మహారాష్ట్ర కేంద్రంగా దందా

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన

Update: 2025-01-05 02:12 GMT

దిశ,ఆసిఫాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువత, విద్యార్థులే లక్ష్యంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఓ వైపు డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని పోలీసులు కృషి చేస్తుంటే..వరుసగా పట్టుబడుతున్న గంజాయితో జిల్లాలో కలవరం సృష్టిస్తున్నాయి. మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో గంజాయి ప్రియులు మత్తులో మునిగి తేలుతున్నారు. దీంతో గంజాయి నియంత్రించేందుకు సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి గంజాయి పట్టుబడుతున్నప్పటికీ.. సరఫరా చేసే వారు మాత్రం బెదరకుండా అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక్క కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే పోలీస్ అధికారిక లెక్కల ప్రకారం 2. 98 క్వింటాళ్ల ఎండు గంజాయితో పాటు 121 గంజాయి మొక్కలను పట్టుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించిన 39 కేసుల్లో 65 మందిని అరెస్టు చేశారు. ఇవి కేవలం జిల్లా పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకున్నవి మాత్రమే. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మహారాష్ట్ర కేంద్రంగా...

మహారాష్ట్రతో పాటు జిల్లాలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేస్తున్నప్పటికీ మహారాష్ట్ర కేంద్రంగా జిల్లా అక్రమార్కులు గంజాయిని వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా బైక్ లతో పాటు కంటైనర్ లాంటి వాహనాలను ఉపయోగిస్తున్నారు. గంజాయి ప్యాకెట్లను వాహనాల బోర్లలో.సీట్ల కింద అమర్చి పోలీసులకు చిక్కకుండా సరఫరా చేస్తున్నట్లు సమాచారం.పోలీసుల తనిఖీల్లో అనేక వాహనాలు పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొందరు రిస్క్ లేకుండా గంజాయి రైళ్లలో సరఫరా చేయించుకుంటున్నారు. బోగీల్లో ఎక్కడో ఓ చోట కూర్చుని మరో చోట సీట్ల కింద గంజాయి బ్యాగులను ఉంచి ఎవరికి అనుమానం రాకుండా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. రైళ్లలో అంతగా పోలీసుల నిఘా ఉండకపోవడంతో గంజాయిని తరలించి సిగ్మర్లు సొమ్ము చేసుకుంటున్నారు.

పోలీసులకు చిక్కకుండా..

గంజాయి తరలిస్తున్న సమయంలో వాసనతో పోలీసులకు పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి చిక్కకుండా ఉండేందుకు అక్రమార్కులు శతకోటి ఉపాయాలు, ఎత్తులు వేస్తున్నారు. గంజాయిని కవర్లలో చుట్టి తరలిస్తున్నారు. కొందరు చిన్న చిన్న ప్యాకెట్ల, చాక్లెట్ల మాదిరిగా తయారు చేసి యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలోని మీదుగా మధ్యప్రదేశ్ కు పుష్ప సినిమా తరహాలో ఆయిల్ ట్యాంకర్ లారీలో అక్రమంగా తరలిస్తున్న 290 కేజీల ఎండు గంజాయి పోలీసులు పట్టుకున్నారు. శతకోటి ఉపాయాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు..ఇక తరలిస్తున్న గంజాయిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.


Similar News