సమస్యలను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలి : కలెక్టర్ రాజర్షి షా
ప్రజా ఫిర్యాదుల విభాగంలో తమ సమస్యను పరిష్కరించాలని
దిశ, ఆదిలాబాద్: ప్రజా ఫిర్యాదుల విభాగంలో తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఇచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారికి న్యాయం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత అధికారులకు అందించి తక్షణమే పరిష్కరించాలని సూచించారు.ఈ సందర్భంగా వివిధ సమస్యలతో పాటు సంక్షేమ పథకాల కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ఆయన అదనపు కలెక్టర్ శ్యామల దేవి తో కలిసి స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు అనేక సంస్థలతోపాటు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. వాటిపై పదేపదే అధికారులను కలుస్తూ దరఖాస్తులు సమర్పిస్తున్నారని తెలియజేశారు. ఇలాంటి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకటికి రెండు సార్లు దరఖాస్తు సమర్పించిన లబ్ధిదారుల వివరాలను పరిశీలన చేసి వాటిని పరిష్కరించాలని అన్నారు. ఇందులో ఆయా శాఖల జిల్లా అధికారులు ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.