ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు.
దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని కెరమరి మండలం దేవాపూర్, అనార్ పల్లి, తుమ్మగూడ జీపీల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాలతో కలిసి కాగజ్ నగర్ మండలం కోసిని జీపీలో పాటు మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు. నూతన ఓటరు నమోదుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు స్వీకరించాలని, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా సరిసూసుకోవాలన్నారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ కోసం బూత్ స్థాయి అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించారని, అందులో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే బూత్ స్థాయి అధికారులకు తెలపాలని కోరారు. జనవరి 1న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈనెల 9, 10 తేదీలలో జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.