ఆదివాసీల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
ఆదివాసీల సంక్షేమమే ప్రధాన లక్ష్యం అని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను అన్నారు.
దిశ, టేకులపల్లి : ఆదివాసీల సంక్షేమమే ప్రధాన లక్ష్యం అని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. బోడు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆదివాసీల సంక్షేమంలో భాగంగా గొత్తి కోయల గ్రామం సిద్ధారంలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇల్లందు డీఎస్పీ ఎన్ .చంద్రభాను మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం, వారి ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం అని అన్నారు. మూఢనమ్మకాలు వదిలి ఆరోగ్యశాఖ వారు ఇచ్చే సూచనలు పాటించాలన్నారు. బాల్య వివాహాలు నేరం అని, అమ్మాయికి కనీసం 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే వివాహం చేయాలని సూచించారు.
ఇద్దరు పిల్లలు కాగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తాటిపాముల సురేష్, బోడు సబ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీకాంత్, ఇండిజినియస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ వైద్యాధికారి డాక్టర్ భదృ నాయక్, సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, హెల్త్ సూపర్వైజర్ పోరండ్ల శ్రీనివాస్, ధనసరి రాంబాబు, అరుణాదేవి, స్రవంతి, సారమ్మ, పంచాయతీ కార్యదర్శి కోరం సునీల్ కుమార్, మాజీ ఎంపీటీసీ కొరస ఈశ్వరయ్య, పటేల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.