లగచర్ల రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయం
లగచర్ల రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
దిశ, ఖమ్మం : లగచర్ల రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా గురువారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పేలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో వారు మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గం లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న తమ పట్టా భూములను గిరిజన రైతులు ఇవ్వబోమని చెప్పినా కూడా వారిని బలవంతం చేయడం తగదన్నారు.
లగచర్ల గిరిజన రైతులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడాలు చేస్తుందని తెలిపారు. రైతులకు రుణమాఫీ అందించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతులకి గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా శుక్రవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మార్కెట్ యార్డ్ లో పర్యటన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ సూడా చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాల కృష్ణ, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.