దిశ ఎఫెక్ట్...తోగ్గూడెం క్వారీ సీజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం క్వారీలపై జిల్లా అధికారులు కొరడా ఝులిపించారు.
దిశ బ్యూరో, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం క్వారీలపై జిల్లా అధికారులు కొరడా ఝులిపించారు. దిశ దిన పత్రిక మెయిన్ లో వరుస కథనాలు రావడంతో అనివార్యంగా చర్యలు తీసుకోవాల్సివచ్చింది. ఇంతకాలం మైనింగ్ నిర్వాహకులతో అంటకాగిన వివిధ శాఖల ఆఫీసర్స్.. ఎట్టకేలకు తోగ్గూడెం క్వారీని మూయించి, లారీలు వెళ్లకుండా రోడ్లపై గుంతలు (ట్రెంచ్) తీశారు. నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ చేస్తున్న తీరును గమనించి నోటీసులు అందజేసినట్లు సమాచారం.
అయితే ఈ విషయమంతా రహస్యంగానే జరగడం, బయటి ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. చివరకు అధికారులు సందర్శించారన్న సమాచారం దిశ కు రావడంతో గురువారం ఉదయం తోగ్గూడెం ప్రాంతాన్ని పరిశీలించగా కంకర లోడ్ తో వెళ్లే లారీలు వెళ్లకుండా రోడ్లపై అడ్డంగా గుంతలు తీయడం కనిపించింది. దాన్ని ఫొటోలు తీసే క్రమంలో అక్కడే చెట్లల్లో ఉన్న కొందరు వ్యక్తులు బెదిరించే ప్రయత్నం చేయడం గమనార్హం. కాగా అధికారులు చర్యలు తీసుకుని క్వారీలను నిలుపుదల చేశారని, నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఉందని స్థానికులు తెలిపి, దిశ పత్రికకు అభినందనలు తెలియజేశారు.
అక్రమ సామ్రాజ్యానికి అడ్డుకట్ట..
ఒక్క క్వారీకి అనుమతులు తీసుకుని మరో తొమ్మిది క్వారీలను అనుమతులు లేకుండా నడుపుతున్నారని ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని వారం రోజులుగా దిశ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని కూడా చెల్లించకుండా దాదాపు రూ.300 కోట్ల మేర బకాయి పడ్డట్లు, అది చెల్లించకుండా కోర్టుకు వెళ్లినట్లు దిశ ప్రచురించింది.
స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు సైతం క్వారీకి వెళ్లాలంటే భయపడే విధంగా ఓ ప్రైవేట్ సామ్రాజ్యమే కాపలాగా ఉండి పహారా కొనసాగించేది. నిర్వాహకులు సైతం భారీగా ముడుపులు ముట్టజెప్పి అధికారులు, నాయకులను మచ్చిక చేసుకున్నాఅక్రమాలు బయటకు రావడం, దిశలో వరుస కథనాలు ప్రచురితం కావడం, రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఈ తతంగంపై విచారణ చేసి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో చర్యలు తీసుకోవడం అనివార్యంగా మారింది.
ఎవరికివారే గప్ చుప్...
కంకర లోడ్ తో లారీలు వెళ్లకుండా రోడ్లపై గుంతలు తీయడం.. క్వారీలు నడవకుండా సీజ్ చేయడం, నిర్వాహకులకు నోటీసులు అందజేయడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు సమాచారం. క్వారీ నిర్వహణలో భాగమైన మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులను సీజ్ విషయమై అడగ్గా ఎవ్వరూ సరైన సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ట్రెంచ్ కొట్టించడం నుంచి, సీజ్ చేసిన విషయం తమకు తెలియదని, ఆ విషయంలో తమను ఏమీ అడగవద్దని వేడుకున్నారు. మూడు శాఖల నుంచి అదే సమాధానం రావడం విస్మయం గొలిపినా.. అసలు నోటీసులు అందజేశారా.. లేదా? సీజ్ చేశారా లేదా? లారీలు వెళ్లకుండా ట్రెంచ్ ఎవరు కొట్టించారు? అని అడిగినా సమాధానం తమ వద్ద లేదని, దయచేసి మమ్మల్ని ఈ విషయంలో లాగకూడదని వేడుకున్నారు.
భయం భయంగానే అధికారులు..
క్వారీ అక్రమాలు వెలుగులోకి రాగానే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తాత్సారం చేయడంతో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలతోనే జిల్లా అధికారులు క్వారీ సందర్శించి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే క్వారీ ప్రాంతం పూర్తిగా ఏజెన్సీలో ఉండటం... అటుగా రావడానికి ఎవ్వరూ సాహసించకపోవడంతో జరిగిన విషయం బహిర్గతం కాకున్నా.. స్థానికుల సమాచారంతో దిశ అక్కడికి వెళ్లి సమాచారం సేకరించింది.
అయితే జిల్లా అధికారులు మాత్రం ఏ ఒక్కరు కూడా ఈ విషయం మీద మాట్లాడేందుకు సాహసించడం లేదు. ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఎవరు సీజ్ చేశారో, ఎవరు ట్రెంచ్ కొట్టారో తమకు తెలియదని అంటున్నారు. ఇదే విషయమై మైనింగ్ ఏడీని సంప్రదించే ప్రయత్నం చేయగా కార్యాలయానికి రాకపోగా.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
అయినా బెదరని దిశ..
వామ్మె... తోగ్గూడెం.. అటు వెళ్లాలంటే జంకుతున్న అధికారులు, జర్నలిస్టులు అంటూ మొదట కథనం ప్రచురితం కాగానే.. క్వారీ నిర్వాహకుడు స్థానిక విలేకరికి ఫోన్ చేసి నానా దుర్భాషలాడాడు. క్వారీలోకి అడుగుపెట్టాలంటే విలేకరులు బెదిరి చస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే క్వారీలో బొంద పెడతామని హెచ్చరించడం విశేషం. నీ పైనున్నోనికి కూడా చెప్పాలంటూ హూంకరించాడు. సంవత్సరం మొత్తం రాసుకున్నా.. ఎవరూ ఏమీ పీకలేరని, ప్రతీనెలా అధికారులకు మామూళ్ల పడేస్తున్నామని చెప్పుకొచ్చాడు.
స్థానిక రాజకీయ నాయకులు కూడా అండగా ఉన్నారని క్వారీవైపు కన్నెత్తి చూసే అధికారే లేడని బెదిరించాడు. అయినా ప్రజల పక్షాన నిలిచిన దిశ బెదిరింపులకు వెరవకుండా వరుస కథనాలు ప్రచురించడం, వాటిని రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులకు పంపించడంతో జిల్లా అధికారుల్లో చలనం వచ్చి చర్యలు తీసుకున్నారు. ఇంత జరిగినా అధికారులు తోగ్గూడెం క్వారీపై చర్యలు తీసుకున్నా రహస్యంగానే ఉంచారు. పూర్తి వివరాల కోసం మైనింగ్ శాఖ ఏడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడం విశేషం.
నాలుగురోజులు పోతే.. మరో దారి తీస్తాం..
అధికారులు లారీలు వెళ్లకుండా గుంతలు తీస్తే.. నాలుగు రోజులు పోయాక మరోదారిని రోడ్డుగా మారుస్తామని క్వారీ నిర్వాహకుడు తన సన్నిహితుల దగ్గర అన్నట్లు తెలిసింది. అధికారుల చర్యలు మామూలేనని నాలుగు రోజులు పోతే అన్నీ సర్ధుకుంటాయని చెప్పినట్లు సమాచారం.
అంతేకాకుండా తమ వ్యాపారానికి అందరూ సహకరిస్తారని, తాము కూడా వాళ్లకు చేయాల్సినవి చేస్తుంటామని సెలవిచ్చినట్లు ప్రచారం. అక్రమమా, సక్రమమా అన్న విషయం వదిలేస్తే జిల్లాలోని అధికారులు, రాజకీయ నాయకులు తమ వ్యాపారానికి సహకరిస్తుంటారని ఆ విషయం గుర్తుంచుకోవాలని, నాలుగు రోజుల్లో మళ్లీ క్వారీ నడుస్తుందని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.