కన్నుల పండువుగా కాడెద్దుల పొలాల పండుగ
ఆరుగాలం కష్టించే రైతన్నలు గురువారం ఇచ్చోడ మండలం లో కాడెద్దుల పొలాల అమావాస్య పండగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.

దిశ, ఇచ్చోడ : ఆరుగాలం కష్టించే రైతన్నలు గురువారం ఇచ్చోడ మండలం లో కాడెద్దుల పొలాల అమావాస్య పండగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం పూట రైతులు ఎడ్లను చెరువులు, వాగుల వద్దకు తీసుకెళ్లి వాటికి స్నానాలు చేయించారు. వ్యవసాయ పని ముట్లకు పూజలు చేశారు. రైతులు కాడెద్దులను జూలు, రంగు రంగులతో, బెలూన్ బుగ్గలతో ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం వేళ ఆయా గ్రామాల్లోని హనుమాన్ ఆలయం వద్దకు మంగళ హారతులతో తీసు కొచ్చి, పూజలు చేశారు.
వేద మంత్రాల నడుమ, భజంత్రీల మధ్య గుడి చుట్టూ కాడెద్దులను ప్రదక్షిణలు చేయించారు. కాడెద్దుల సంబరాన్ని చూసేందుకు ఊరు ఊరంతా సంబరంగా హనుమండ్ల ఆలయాల వద్దకు యువతి, యువకులు, చిన్నారులు, రైతుల కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. బసవన్నలతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు, వీడియో లు దిగి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఇంటికి తీసుకొచ్చి వాటికి పూజించి, తీపి నైవేద్యాలను తినిపించారు. గ్రామదేవతలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.