ఎన్నికల సమయంలోనే సీఎం హామీ.. పండుగకు ముందే పందేరం
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతోంది. ఇటీవలే జిల్లా గ్రంథాలయాలకు
దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దసరా పండగకు ముందే పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం, రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ లను నియమించగా.. ఇందులో నిర్మల్ జిల్లాకు కొత్త చైర్మన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వారంలోనే పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు, దేవాలయ కమిటీలకు పాలకవర్గాలను నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు నేతల్లో ఆసక్తి నెలకొంది. పలు నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఉన్న చోట్ల మినహా.. మిగతా పాలకవర్గాలకు త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
మైనారిటీ నేతకు కీలక పదవి..!
నామినేటెడ్ పదవుల పంపిణీకి కాంగ్రెస్ అధిష్టానం శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ మైనారిటీ నాయకుడు అర్జుమంద్ అలీ కి కీలకమైన పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రచారంలో భాగంగా నిర్మల్ వేదికపై నుంచి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ కోసం పనిచేసిన వారికి కచ్చితంగా మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఆ రోజే మైనారిటీ నేత అర్జుమంద్ అలీకి భరోసా ఇచ్చారు అన్నట్టుగానే రాష్ట్రంలో 13 మంది గ్రంథాలయాలకు చైర్మన్ లను నియమించగా.. ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే ఆయన ఆ పదవిపై కొంత విముఖతతో ఉన్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా పదవుల పందేరం ప్రారంభం కావడంతో కాంగ్రెస్ ఆశావహుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకమండళ్లను ప్రభుత్వం నియమించింది. అయితే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నచోట ఎలాంటి వివాదం లేకుండా చైర్మన్, పాలకమండలి పదవులను భర్తీ చేస్తున్నారు. శాసనసభ్యులు లేని నియోజకవర్గాల్లో ఈ పదవుల భర్తీని అధిష్టానం ఆచితూచి భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది మంచిర్యాల నియోజకవర్గంలో లక్షెట్టిపేట మార్కెట్ చైర్మన్ గా దాసరి ప్రేమ్ చంద్, మంచిర్యాల చైర్ పర్సన్ గా పయ్యావుల పద్మను అక్కడి శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావ్ సూచన మేరకు భర్తీ చేశారు. సిర్పూర్ నియోజక వర్గంలో కౌటాలా మండలానికి చెందిన సుద్దాల దేవయ్యను చైర్మన్ గా, ఇతర పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్ నియోజక వర్గంలో జైనథ్ మార్కెట్ కమిటీ కి అశోక్ రెడ్డిని నియమించారు. బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బొడ్డు గంగయ్యను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా అక్కడ పాలకవర్గం కొలువు దీరింది.
త్వరలోనే మిగతా కమిటీలకు..
ఇప్పటికే పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించిన ప్రభుత్వం త్వరలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమించే కసరత్తు చేస్తున్నది. నిర్మల్ నియోజకవర్గం లో ఉన్న నిర్మల్ సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామక వ్యవహారం ఒక కొలిక్కి రాగా ఈ వారంలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జైనూరు ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి అక్కడి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ వేరువేరు పేర్లను అధిష్టానానికి ఇవ్వగా పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గం అక్కడి కమిటీల నియామకం ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర మార్కెట్ కమిటీలకు సంబంధించి అక్కడి నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి నియామక ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉందంటున్నారు. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న సమాచారం ఉంది. ముధోల్ నియోజకవర్గం లో ఓ కాంగ్రెస్ సీనియర్ నేత అక్కడి మార్కెట్ చైర్మన్ పదవిని ఆశిస్తుండగా.. నియోజకవర్గ ఇన్చార్జి అధిష్టానం పై చేసిన ఒత్తిడి వల్ల నియామక ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా మరికొన్ని మార్కెట్ కమిటీలతో పాటు దాదాపు మెజారిటీ కమిటీలకు త్వరలోనే పాలకవర్గాలను నియమించేందుకు అధిష్టానం కసరత్తు పూర్తిచేసి ఉత్తర్వుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు పలు దేవాలయ కమిటీలు కూడా భర్తీ కానున్నాయి ఇందులో ప్రధానంగా నిర్మల్ జిల్లాలోని అడెల్లి మహా పోచమ్మ దేవస్థానం, దేవరకోట దేవస్థానం, కాల్వ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కదిలి పాప హరీశ్వర దేవస్థానం, బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం సహా ఉమ్మడి జిల్లాలోని జైనాథ్ సూర్య దేవాలయం, బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానం, రెబ్బెన మండలం గంగాపూర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సహా ఇతర దేవాలయాల కమిటీలకు పాలకవర్గాలను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ నియామకాలపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.