కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలవాలి
చదువుతోపాటు విద్యార్థులు క్రీడా రంగంలోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
దిశ, ముధోల్ : చదువుతోపాటు విద్యార్థులు క్రీడా రంగంలోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం ముధోల్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జోనల్ స్థాయి క్రీడా పోటీల ముగింపు ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్బంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వంటి తమకు ఇష్టమైన ఆటలు ఆడాలని, క్రీడలు శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అన్నారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు కష్టపడి చదవాలని తల్లిదండ్రులకు, కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. అనంతరం జోనల్ స్థాయి క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం కలెక్టర్, అధికారులను కళాశాల ఉద్యోగులు, సిబ్బంది శాలువాలతో సత్కరించారు. అంతకుముందు దేశభక్తి గీతాలపై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీఎచ్.నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనందరావు పటేల్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, విద్యాధికారి రమణారెడ్డి అధికారులు, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.