ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న ఉపాధ్యాయుడు

నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి చెందిన పూరస్తూ రాహుల్ ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తూ పదిమంది... Special Story on Agriculture

Update: 2023-03-23 07:35 GMT

దిశ, భైంసా: నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి చెందిన పూరస్తూ రాహుల్ ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తూ పదిమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వృత్తిరీత్యా సంగీత ఉపాధ్యాయుడిగా రాణిస్తున్న రాహుల్ పలువురు కుటుంబ సభ్యుల్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని చూసి, దాని కారణాలు లోతుగా అన్వేషించగా తీసుకునే ఫుడ్ కల్తీగా ఉండడం అని తెలుసుకుని ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగు వేశాడు. హైదరాబాద్ కు చెందిన విజయరామ్ సేంద్రియ వ్యవసాయాన్ని చేయడాన్ని ఆదర్శంగా తీసుకుని నిజామాబాద్ కు చెందిన దేశీ వంగడాల స్పెషలిస్ట్ చిన్ని కృష్ణయ్య వద్ద కొన్ని రకాల జాతి వంగడాలను తీసుకుని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఎన్నో రకాల దేశి వంగడాలను, వరి రకాలను, పండ్ల రకాలను, కూరగాయలను ఇతని పంట పొలంలో పండిస్తున్నాడు.


సంగీత ఉపాధ్యాయునిగా రాణిస్తూ తనకున్న మూడు ఎకరాల పొలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి వరి రకాలైన రత్నచొడి, రక్తశాలి, బహురూపీ అనే వరి పంట రకాలను పండిచారు. ఇలాంటి పురాతన రకాల వంగడాలను కనుమరుగవుతున్న తరుణంలో మళ్లీ వాటిలో ఉన్నటువంటి పోషకాలను గమనించి సాగు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయానికి పనికివచ్చే జీవామృతం, బ్రహ్మాస్త్రం, నిమ్మస్త్రం వంటి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయానికి రైతులు విపరీతంగా ఎరువులను ఉపయోగించగా సేంద్రియ వ్యవసాయానికి మాత్రం ఆవులు ఉంటే సరిపోతుందని తెలిపారు. మూడు ఆవులు ఉంటే మూడు ఎకరాలకు సరిపడే ఎరువులు లభిస్తుందని తెలిపారు. పంటలపై క్రిములు నివారణకు గోమూత్రం, వేపరసం లాంటివి ఉపయోగిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ పద్ధతి ద్వారా తాను పండించినటువంటి పంటలను ఇంటి అవసరాలకు వినియోగించుకోగా... మిగిలి ఉన్న పంటలను వేరే జిల్లా వాళ్లు సైతం వచ్చి అధిక డబ్బులు చెల్లించి కొనుక్కుంటున్నారు. రాబోయే యువత వ్యవసాయ పద్ధతిలో మార్పులు తీసుకొచ్చి సేంద్రియ వ్యవసాయం వైపు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ భావితరాలు నిర్మించాలని తెలిపారు.

Tags:    

Similar News