మొదలైన సింగరేణి ఎన్నికల పోలింగ్
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కోసం జరుగుతున్న ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కోసం జరుగుతున్న ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికలు ప్రారంభం కాగా, కార్మికులు ఓటేసేందుకు క్యూ కట్టారు. అధికారులు ఈ మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిన ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏడో విడత జరగనున్న ఎన్నికల్లో 39,773 కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాల్లో ఉద్యోగులు ఓటేయనున్నారు. 650 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వహిస్తున్నారు.
సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా ఇప్పుడు ఏడోమారు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి పోలీసులు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను నియమించారు. రీజియన్‌కు ఒక అధికారి చొప్పున ప్రత్యేక పరిశీలకులను నియమించారు. మంగళవారం సాయంత్రమే ప్రిసైడింగ్, అసిస్టెంట్, ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్ర కార్మిక శాఖ అధికారులు మొత్తం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఓటు వేయడానికి గుర్తింపు కార్డు ఖచ్చితంగా తెచ్చుకోవాలని అధికారులు కార్మికులను కోరారు. అయితే, గుర్తింపు కార్డు లేకపోతే గనులపై తాత్కాలికంగా గుర్తింపు కార్డు జారీ చేయనున్నారు. ఇక 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం మూడు కార్మిక సంఘాల మధ్యనే ఉండబోతోంది. ఇక్కడ సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలుపొందిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందిన వారే కాబట్టి కార్మికులు ఆ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్‌టీయూసీ వైపు మొగ్గు చూపే అవకాశాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ సైతం పోటీలో ఉంది.