జాతరలా ఇంటింటి సర్వే.. 9 నుంచి సమగ్ర సమాచారం నమోదు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతరలా మొదలైంది.
దిశ ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతరలా మొదలైంది. తొలి రోజైన బుధవారం ఉదయం నుంచే ఎన్యూమరేటర్లు క్షేత్రంలోకి దిగి కార్యాచరణ ప్రారంభించారు. 13 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో తొలి మూడు రోజులు హౌస్ లిస్టింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక గైడ్ లైన్స్ మేరకు సర్వే నిర్వహణకు కేటాయించిన సిబ్బంది గ్రామాల్లో, పట్టణంలోని ఆయా వార్డుల్లో హౌస్ లిస్టింగ్ మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్ అతికించారు. ఈరోజు వారి వద్దకు వస్తారోనన్న సమాచారాన్ని ఆయా కుటుంబాల సభ్యులకు సర్వే సిబ్బంది తెలపడం కనిపించింది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది.
ప్రధానంగా కుల గణన ప్రస్తావన..
సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహణ సందర్భంగా ఎక్కువగా కుల గణన ప్రస్తావన కనిపించింది. ఈ సర్వేలో కుటుంబానికి సంబంధించిన 56 రకాల అంశాలను అడిగి తెలుసుకునేలా సర్వే ఫారాలు ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తున్న కుల గణన పైనే ఈ సర్వే జరుగుతున్నదన్న అభిప్రాయాలు ప్రజల్లో కనిపించాయి. గ్రామాలకు ముందుగా హౌస్ లిస్టింగ్ కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి సోదర ఆహ్వానాలు కనిపించాయి. గ్రామానికి వచ్చిన సిబ్బంది అధికారులను ప్రజలు మా గ్రామంలో ఇన్ని కులాలు, ఇన్ని కుటుంబాలు ఉన్నాయంటూ... మీకు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని పిలవండి అంటూ ప్రజలు ప్రోత్సహిస్తుండడంతో సర్వే కోసం గ్రామాలకు వచ్చిన సిబ్బంది అధికారులు సంతోషాన్ని కనబరిచారు. కుల గణన తర్వాత ఆయా గ్రామాల్లో కులాల వారీగా జనాభా ఓటర్ల సంఖ్య తేలే అవకాశం ఉండటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి కనిపిస్తుంది.
రంగంలోకి కలెక్టర్లు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లు సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు తొలి మూడు రోజులు వరుసగా హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలని సూచిస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్లు గ్రామాలను పట్టణాల్లో వార్డులను సందర్శించి హౌస్ లిస్టింగ్ తీరును సమీక్షించారు. ఈ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా చూడాలని... ఇల్లు లేని సంచార కుటుంబాలను కూడా గుర్తించి వారిని కూడా సర్వేలో చేర్చాలని ఈ సందర్భంగా కలెక్టర్లు సర్వే సిబ్బందిని ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మూడు చోట్ల ఆకస్మికంగా తనిఖీ చేసి సర్వేను పరిశీలించారు. 6,7,8 తేదీల్లో హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. తొమ్మిదో తేదీ నుంచి కుటుంబ వివరాల సేకరణ ప్రారంభించాలని సూచించారు.
నిర్మల్ జిల్లాలో 396 గ్రామాలతో పాటు నిర్మల్ బైంసా ఖానాపూర్ పురపాలక సంఘాల్లో సర్వే ప్రారంభమైంది. ఇక్కడ కూడా అవాంతరాలు జరిగిన సమాచారం లేదు. 1951 మంది సర్వే సిబ్బందిని నియమించి వారితో సర్వే ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాజార్షు షా, ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ వెంకటేష్ దొత్రే, మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ దీపక్ స్వయంగా సర్వే పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయా మండలాల తహశీల్దార్లు మండల పరిషత్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సర్వే పూర్తయ్యే వరకు ఎక్కడ కూడా అవాంతరాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు సర్వే సందర్భంగా తప్పులు దొర్లితే అధికారులను బాధ్యులను చేస్తామని బీసీ కమిషన్ హెచ్చరించిన నేపథ్యంలో హౌస్ లిస్టింగ్ నుంచి సర్వే పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు.