సర్వేలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు షోకాజ్ నోటీసులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే లో నిర్లక్ష్యం వహించిన ఇచ్చోడ మండలం ఎంపీడీఓ, ఏఓ, పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Update: 2024-11-06 12:27 GMT

దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే లో నిర్లక్ష్యం వహించిన ఇచ్చోడ మండలం ఎంపీడీఓ, ఏఓ, పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మండలంలోని గెర్జం, ముక్రా కె గ్రామాల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రారంభమైన ఇండ్ల జాబితా సర్వేను పరిశీలించారు.

     ఈ సందర్భంగా గెర్జం గ్రామంలో ఇళ్ల జాబితా సర్వే సరిగా నిర్వహించకపోవడంతో పాటు, స్టిక్కర్ల పై సరైన వివరాలు నమోదు చేయకపోవడం, సర్వే కు సంబంధించి మ్యాప్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సర్వే నిర్వహించాలో ముందుగా నిర్దారించక పోవడం, సర్వేలో తప్పులు నమోదు చేయడంతో ఎంపీడీఓ లక్ష్మణ్, ఏఓ ఏ.కైలాస్, పంచాయతీ సెక్రటరీ సయ్యద్ ఏజాజ్ హస్మి లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత కొద్ది రోజుల నుంచి సమగ్ర ఇంటింటి జాబితాపై శిక్షణ ఇచ్చినా విధులు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    విధులలో నిర్లక్ష్యం వహించినందున వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. అనంతరం ముఖారా కె ఇంటింటి సర్వేను పరిశీలించి పకడ్బందీగా ఇండ్ల జాబితా వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే ఇచ్చోడ మండలం ముఖర కె లో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని, ఏపుగా పెరిగిన టెకుచెట్లను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ, ఏఓ, పంచాయతీ సెక్రటరీ , కారోబార్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News