Collector Rajarshi Shah : అన్ని వివరాలతో ప్రజలు సిద్ధంగా ఉండాలి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లా ప్రజలు ఉత్తమ పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కోరారు.
దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లా ప్రజలు ఉత్తమ పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కోరారు. స్థానిక ఓల్డ్ హౌసింగ్ బోర్డులో బుధవారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే - సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన ఇండ్ల జాబితా సర్వేను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లాలో ఈ సర్వే రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో పకడ్బందీగా ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ సర్వే కోసం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,97,000 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారన్నారు. ఈ సర్వే కోసం 213 మంది ఎనిమిటర్లను నియమించామని తెలియజేశారు. ఈ సర్వే ద్వారా ఏ ఒక్క ఇంటిని కూడా తప్పిపోకుండా గుర్తించి వారు పూర్తి వివరాలను డీటెయిల్స్ లో తమ సిబ్బంది నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు.
ఈ సర్వేలో భాగంగా తమ దృష్టికి కొన్ని సమస్యలు వచ్చాయని ముఖ్యంగా ఆదిలాబాద్ లో కొంతమంది అద్దె ఇళ్లలో ఉంటున్న వారు సర్వే కోసం వెళ్లిన వారితో తమ వివరాలు గ్రామాల్లో నమోదు చేసుకుంటామని తెలియజేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి వారు తమ గ్రామాలలో సర్వేకు వచ్చిన అధికారులకు ముందస్తుగా అక్కడే నమోదు చేసుకునేందుకు పూర్తి వివరాలు సిద్ధం చేసుకుని ఉండాలని సూచించారు. వారు నివసించే ప్రాంతంలోని పూర్తి నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు అడవి ప్రాంతంలో ఉండేవారు సైతం తమ అటవీ హక్కు పత్రాలను తమ వద్ద ఉంచుకొని సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఇండ్ల జాబితాను గుర్తించేందుకు సర్వే కొనసాగుతుందని రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సర్వే కోసం డీటెయిల్స్ బుక్ లెట్ వచ్చిన అనంతరం అన్ని వివరాలు నమోదు చేస్తారని, అందుకు జిల్లా ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆయా కాలనీ కౌన్సిలర్లు సర్వే సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఇందులో వార్డ్ కౌన్సిలర్ అంబకంటి అశోక్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ బిల్ కలెక్టర్ తదితరులు ఉన్నారు.