రాహుల్ గాంధీ పై అనర్హత వేటు అప్రజాస్వామికం : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఎంపీగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికం, దుర్మార్గ చర్య అని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు.
దిశ, తాండూర్ : ఎంపీగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికం, దుర్మార్గ చర్య అని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. శుక్రవారం ఆయన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాడిగూడలో పీపుల్స్ మార్చ్ నిర్వహించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు పై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యవాదం, దేశ సంపద, ప్రజలకే చెందాలని.. ఆదానికి కాదని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టడం వలన దేశంలో ఆదరణ పెరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశచరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరగని విధంగా రాహుల్ గాంధీని ఎంపీగా వేటువేస్తూ లోకసభ సెక్రటేరీయేట్ నిర్ణయించడం భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు పెట్టి సూరత్ కోర్టులో శిక్ష వేయించి న్యాయవ్యవస్థను బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. కేసుపెట్టి, జైలుకు పంపాలని మోడీ అమిత్ షా చేసే కుట్రలు, బెదిరింపులకు రాహుల్ లొంగడన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ వారసుడు రాహుల్ గాంధీ మోడీ, అమిత్ షా బెదిరింపులకు భయపడడన్నారు. జైలు శిక్ష పడిందని పార్లమెంటు నుంచి బహిష్కరించేందుకు చేసిన కుట్రలు దేశానికి మాయని మచ్చగా మిగులుతాయన్నారు. రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు బీజేపీని భూస్థాపితం చేయడానికి నాంది పలుకుతుందన్నారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై పార్టీ అధిష్టానం న్యాయ పోరాటం చేస్తుందన్నారు.