గులాబీ పార్టీ నేతల్లో నైరాశ్యం..ముఖ్య నేతల పట్టింపు లేకపోవడమే కారణం..?
త్వరలోనే పంచాయతీ ఎన్నికలు సహా మండల జిల్లా పరిషత్
దిశ ప్రతినిధి, నిర్మల్ : త్వరలోనే పంచాయతీ ఎన్నికలు సహా మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ముంచుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్రతిహతంగా పదేళ్లు శాసించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీ కి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో వచ్చే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆదిలాబాద్ జిల్లా మినహా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పార్టీ తరపున కీలక పదవులకు అభ్యర్థులు కనిపించడం లేదు.
మాకు పదవులు వద్దు...
భారత్ రాష్ట్ర సమితి పార్టీ వెలుగు వెలిగిన సమయంలో మమ్మల్ని మించిన వారు లేరు అన్నట్లుగా ప్రవర్తించిన ఆ పార్టీ నేతలు వచ్చే మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి అసలే చూపకపోవడం పార్టీని నమ్ముకున్న కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీ సింబల్ లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో తెలంగాణ సెంటిమెంట్ తో పోటీ చేసేందుకు గ్రామాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ మండల జిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో మాత్రం గులాబీ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిచి కూడా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం గులాబీ పార్టీ నేతల్లో ఉంది మరోవైపు ఆ పార్టీ నుంచి నిలబడితే ఇప్పటికిప్పుడు తమకు జరిగే లాభం కూడా ఏమీ లేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇక్కడ తమకు అధికారం ఉంటే అన్ని చక్కదిద్దుకోవచ్చన్న అభిప్రాయం తోనే ఆ పార్టీ నేతలు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ దశాబ్ద కాలం గులాబీ పార్టీతో ఎంజాయ్ చేసిన నేతలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంపై పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణం అవుతుంది.
ఆదిలాబాద్ జిల్లా మినహా...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరఫున మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బలంగా ఉండటం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ కోసం గట్టిగా పనిచేస్తుండడం ఆ జిల్లాలో పార్టీకి కొంత బలంగా ఉంది దీంతో ఆ జిల్లాలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ అందరూ కాంగ్రెస్ లో చేరారు. ఒక్క ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రం పార్టీ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ కొంత పార్టీ కోసం పనిచేస్తున్న వాతావరణం ఉంది. మిగతా రెండు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ రెక్కలు ఊడినట్లు గానే కనిపిస్తున్నది. దీంతో ఈ జిల్లాలో పార్టీ తరపున పోటీ చేసినందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
మంచిర్యాల జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన నియోజకవర్గంలో మాత్రమే కొంత ప్రభావం చూపుతున్నారు. ఇక మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు అసలే లేవు. ముఖ్యంగా మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రతాపం కారణంతో భారత్ రాష్ట్ర సమితి పార్టీ చతికిలపడింది. ఆయనతో తలపడేందుకు నియోజకవర్గంలో భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఉన్నప్పటికీ ఆమె ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతుంది ఆ నియోజకవర్గంలోనూ ఒకటి రెండు మండలాలు మినహా పెద్దగా ఆమెకు బలం ఉన్నట్లు కనిపించడం లేదు. కాగజ్ నగర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరినప్పటికీ పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం లేదన్న అభిప్రాయంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు.