అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

Update: 2024-11-20 14:13 GMT

దిశ, బెల్లంపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

    విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కార్యాచరణ ప్రకారంగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

కుటుంబ సర్వే తనిఖీ..

అనంతరం బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణతో కలిసి బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాలబస్తీలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్లు పొరపాటు లేకుండా నమోదు చేయాలన్నారు. తమకు కేటాయించిన బ్లాక్ లోని కుటుంబ సభ్యుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.

     సర్వే కోసం ప్రభుత్వం నిర్ధేశించిన నమూనాలోని ప్రతి అంశానికి సంబంధించి వివరాలు సేకరించాలని తెలిపారు. సర్వే నిర్వహించే ప్రాంతంలో ముందు రోజు సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్నారు. ఇంటి యజమానులు అవసరమైన పత్రాలతో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 


Similar News