సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలి
రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
దిశ, తాండూర్ : రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మండలంలోని రేపల్లెవాడ వద్ద గల పత్తి జిన్నింగ్ మిల్లును బుధవారం కలెక్టర్ సందర్శించి మాట్లాడుతూ రైతులు తప్పకుండా ఆధార్ లింక్ చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పత్రాలను అప్డేట్ చేయించుకుని పత్తి విక్రయించడానికి తీసుకురావాలన్నారు. తేమ శాతం లేకుండా చూసుకుంటే పత్తికి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.
తాము ఉదయం నుండి పత్తి విక్రయించడం కోసం వేచి చూస్తున్నామని, ఆన్లైన్లో ఓటీపీ సరిగా రావడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి ఫోన్ ద్వారా సీసీఐ జిల్లా అధికారితో మాట్లాడి కొనుగోలు కేంద్రాల వద్ద మరో వ్యక్తిని నియమించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం తాండూర్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సకాలంలో నివాస, కుల, ఆదాయ, ఇతరత్రా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ పఠాన్, నాయబ్ తహసీల్దార్ ప్రసాద్ తదితరులున్నారు.