ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై టీపీసీసీ దృష్టి సారించింది.

Update: 2025-01-07 06:40 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై టీపీసీసీ దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ఓ వైపు ప్రభుత్వ పాలనపై దృష్టి పెడుతూనే బాధ్యులైన కాంగ్రెస్ శ్రేణులు మరోవైపు పార్టీ పై పట్టు సాధించాలని దిశా నిర్దేశం చేశారు. సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తదితరుల సమక్షంలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశం పార్టీ శ్రేణులు కొత్త ఉత్తేజాన్ని నింపింది. వచ్చే నాలుగు ఏళ్ల పాటు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం పై చర్చ కొనసాగింది.

పార్టీలో అంతర్గత విభేదాల పై...

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పై వేరువేరుగా చర్చ జరిగింది. ఖానాపూర్ నియోజకవర్గం మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నడుమ విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వర్గాల నడుమ పోరు ఉంది. అలాగే బోథ్ నియోజకవర్గంలో ఆడే గజేందర్, ఎస్ అశోక్ వర్గాల నడుమ, నిర్మల్ నియోజకవర్గంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నడుమ, ముధోల్ నియోజకవర్గంలో ఇంచార్జి నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ నడుమ విభేదాలు ఉన్నట్లు ఈ సందర్భంగా పార్టీ అధినాయకత్వం గుర్తించింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ నడుమ, సిర్పూర్ నియోజకవర్గంలో ఇన్చార్జి రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప నడుమ విభేదాలు ఉన్న విషయం ఈ సందర్భంగా వచ్చినట్లు తెలిసింది.

ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెద్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నడుమ కొంతమేర విభేదాలు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే తోనే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిర్మల్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు, ఆదిలాబాద్ లో శ్రీనివాస్ రెడ్డి, బోథ్ నియోజకవర్గంలో ఆడే గజేందర్ ల మాట చెల్లుబాటు అవుతున్నదని తమ వర్గాలకు కనీస ప్రాధాన్యం దక్కడం లేదని ఈ సందర్భంగా అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ముధోల్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరావు పటేల్ అసంతృప్తితో ఉన్నట్లు అధిష్టానానికి సమాచారం అందింది. ఆయా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో మంత్రి సీతక్క పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇకనుండి ప్రతినెలా నియోజకవర్గాల వారీగా మంత్రి సీతక్క సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

నామినేటెడ్ పదవులు...

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో గ్రామ మండల జిల్లా స్థాయి పార్టీ కమిటీలు పూర్తిస్థాయిలో లేవు ఈ కమిటీలను బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు మంత్రి సీతక్క ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారు. దీని పై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి కమిటీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. అలాగే పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో అధిష్టానం చొరవ తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ రాష్ట్ర నాయకత్వానికి సూచన చేశారు.

విభేదాలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ పార్టీ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత నియోజకవర్గాల ఇన్చార్జీలు జిల్లా అధ్యక్షుల బాధ్యతగా ఈ సందర్భంగా ఆయన సూచన చేసినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను సంతృప్తి పరచడం లేదన్న అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇలాంటి అంశాలపై కూడా ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని ఇష్యూ ఒకవేళ సీరియస్ గా ఉంటే గాంధీభవన్ కు వచ్చి చర్చించుకోవాలని, పార్టీలో ఉన్న విభేదాలను రోడ్డున పడేలా వ్యవహరించవద్దని పార్టీ అగ్ర నేతలు కొంత కటవుగానే హెచ్చరించారు.

ఎన్నికల్లో జెండా ఎగరాల్సిందే...

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% పైగా గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ అగ్ర నేతలు ఈ సందర్భంగా జిల్లా పార్టీ శ్రేణులకు సూచించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా ఈ అంశాలపైనే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు గ్రామ మండల జిల్లా స్థాయిలో కార్యకర్తలు నేతలు నడుమ ఉన్న అంతరం తగ్గించేలా చొరవ తీసుకునే బాధ్యతను నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ఇప్పటినుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని ఈ సందర్భంగా పార్టీ స్టేట్ చీఫ్ సూచన చేశారు. దీనికి నియోజకవర్గాల బాధ్యులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు సుముఖత వ్యక్తం చేశారు.

పార్టీ కేడర్లో కొత్త జోష్...

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తదితరులు హాజరైన ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపింది గ్రామ, మండల జిల్లా స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రకటించడం, పంచాయతీ మండల జడ్పీ ఎన్నికలు జరిగితే పార్టీ కోసం పనిచేసిన వారికి కచ్చితంగా అవకాశం ఇస్తామని పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. దీంతో కార్యకర్తలు, నాయకులతో సంతోషంగా పలకరించుకోవడం కనిపించింది. సమావేశంలో విభేదాలు లేకుండా జరగడంతో రాష్ట్ర నాయకత్వం కూడా హర్షం వ్యక్తం చేసింది.


Similar News