చోరీ కేసును ఛేదించిన పోలీసులు..
ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో జరిగిన చోరీకేసును పోలీసులు ఛేదించారు.
దిశ, ముధోల్ : ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో జరిగిన చోరీకేసును పోలీసులు ఛేదించారు. బుధవారం మండల కేంద్రంలోని ముధోల్లోని పోలీస్ స్టేషన్లో బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. టోక్రేకర్ లత గత నెల 21న భర్తకు అనారోగ్యం కలగడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇంటికి తాళం ఉన్న విషయాన్ని గమనించిన టోక్రెకర్ శుదోధన్ మార్చి 1న రాత్రి ఇంటికివేసిన తాళం పగులగొట్టి దాచిపెట్టిన రూ.1.21లక్షలు తీసుకెళ్లాడని పేర్కొన్నారు. తర్వాతి రోజు బాధితురాలికి విషయం ఇరుగుపొరుగువారు చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు.
ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలోని బృందం దర్యాప్తు చేపట్టగా నిందితుడు దొంగిలించిన డబ్బు తన ఇంట్లో దాచిపెట్టి మహారాష్ట్రలోని నందాలో తన అత్తగారి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారన్నారు. బుధవారం ఉదయం సరస్వతి నగర్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా తిరుగుతున్న శుద్దోదన్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితునికి రిమాండుకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చోరీ కేసును చేదించడంలో చాక్యచక్యంగా వ్యవహరించిన ఎస్సైతో పాటు ఏఎస్ఐ, సిబ్బందిని అభినందించారు. గ్రామాల్లో ఇళ్ళు అద్దెకిచ్చే సమయంలో తప్పనిసరిగా ఆధార్ కార్డును తీసుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ముధోల్ సీఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు.