మొబైల్, ఇంటర్నెట్ సేవలు విస్తరించాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
జిల్లాలో ఇంటర్నెట్ లేని మారుమూల గ్రామాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు
దిశ,ఆసిఫాబాద్ : జిల్లాలో ఇంటర్నెట్ లేని మారుమూల గ్రామాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు విస్తరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ తో కలిసి బీఎస్ఎన్ఎల్ టీ ఫైబర్,పంచాయతీ రాజ్,రోడ్డు భవనాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, సివిల్ సప్లై అధికారులతో మొబైల్ ఇంటర్నెట్ సేవలు విస్తరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ప్రభుత్వ అందించే అనేక పథకాలు ఇంటర్నెట్ తో ముడిపడి ఉన్నాయని, మొబైల్ ఇంటర్నెట్ సేవలు లేకపోతే జిల్లాలోని పలు గ్రామాల్లోని పేదలకు రేషన్ బియ్యం తో పాటు, పెన్షన్ లాంటి పథకాల అమలులో జాప్యం జరుగుతోందని చెప్పారు.ఇంటర్నెట్ లేని గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు పేర్కొన్నారు. మొబైల్ టవర్ ఏర్పాట్లకు స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.భారత ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు 9,10న రెండు రోజులు ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ వోలు 18 ఏళ్లు నిండిన వారిచే ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు.