సిరిసిల్ల కంటే దీటుగా ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

ఖానాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

Update: 2024-02-16 11:37 GMT

దిశ, ఖానాపూర్: ఖానాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఖానాపూర్ నియోజకవర్గంలోని సమస్యల పై ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని, మాటిచ్చి చేతులు దులుపుకున్నారు అని ఆయన అన్నారు. ఖానాపూర్ మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

డిగ్రీ కళాశాల ఏర్పాటుతో కడం,పెంబి, దస్తురాబాద్ మండలాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గుడిహత్నూర్ నుంచి మొదలుకొని మంచిర్యాల జిల్లా వరకు నాలుగు వరుసల రోడ్డును నిర్మించాలన్నారు. రంగన్నపేట గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలన్నారు. గతంలో కురిసిన చిన్నపాటి వర్షానికి గంగాపూర్, పసుపుల బ్రిడ్జి, పసుపుల కూలిపోయిందని, బ్రిడ్జి పనులను త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్నారు. కడం బ్రిడ్జ్‌ను పూర్తి చెయాలన్నారు.

అల్లంపల్లి, వాయిపేట,అంకెన రాయదారి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అన్నారు. ఉట్నూరు కేంద్రంలో డి.ఎడ్ కళాశాలను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన 317 జీవోను రద్దు చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. జీవో నెంబర్ 46 ను సైతం రద్దు చేయాలన్నారు. కేటీఆర్ మిత్రుడు జాన్సన్ నాయక్ సిరిసిల్ల లాగా మారుస్తా అని ప్రచారం చేశారని కాంగ్రెస్ హయాంలో ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామన్నారు.

స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

పురపాలక శాఖ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ. ఖానాపూర్ నియోజకవర్గ సమస్యలను త్వరలో నే పరిష్కరిస్తామన్నారు. త్వరలో అన్ని శాఖలకు ఆదేశాలిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఖానాపూర్ లో రెవెన్యూ డివిజన్ అంశం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఖానాపూర్‌ను త్వరలోనే డివిజన్ ఏర్పాటు కు కృషి చేస్తానని తెలిపారు.


Similar News