15,16వ తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15,16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15,16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ పరీక్షలు రెండు రోజుల పాటు నిర్వహించనుండగా అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్ లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు 29 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో ఆదిలాబాద్ అర్బన్ పరిధిలో 14, రూరల్ లో 4, మావలలో10, జైనథ్ లో 1 మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో మొత్తం 10,428 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్ లు, శాఖాపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ ఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పరీక్ష పత్రాల బందోబస్తు, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని కోరారు. స్క్రిబ్ సెంటర్ ను ప్రభుత్వ బాలికల హైస్కూల్, భూక్తాపూర్ లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డిసెంబర్ 15వ తేదీన ఉదయం 10.00 గంటల నుండి 12. 30 వరకు, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు, తిరిగి డిసెంబర్ 16వ తేదీ ఉదయం10.00 గంటల నుండి 12.30 వరకు, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5. 30 వరకు 4 దఫాలుగా పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని, మొబైల్ ఫోన్స్ , ఎలక్ట్రానిక్స్ వస్తువులతో పరీక్ష కేంద్రాలకు రాకూడదని, పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు.
పరీక్షల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అందరూ ఐడీ కార్డులు ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సదుపాయం సరిచూసుకోవాలని, నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్య తీసుకోవాలని కోరారు. టాయిలెట్స్, తాగునీరు, అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత సెంటర్ నిర్వాహకులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ నిర్వహించాలని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమయానుకూలంగా బస్సులు నడపాలని కోరారు.
జిరాక్స్ మిషన్స్ మూసివేయాలని అన్నారు. అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికెట్, బ్లాక్, బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలని, ఏదేని ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్/ డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ కార్డు/ పాన్ కార్డ్/పాస్ పోర్ట్ ) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు ఎస్పీ సురేందర్, ట్రైనీ కలెక్టర్ అబిగ్యాన్ మాలవీయ, డీఎస్పీ జీవన్ రెడ్డి, రీజనల్ కో-ఆర్డినేటర్ జగ్రాం అంతరెడ్డి, తహసీల్దార్లు, గ్రూప్ 2, పరీక్షల ప్రత్యేక అధికారులు, చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.