ఆదిలాబాద్ స్థానం పై వీడని ఉత్కంఠ..!
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో అదే ఉత్కంఠ కొనసాగుతోంది.
దిశ, ప్రతినిధి నిర్మల్: ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో అదే ఉత్కంఠ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం విడుదల చేసిన తొలి జాబితాలో సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావుకు చోటు దక్కలేదు. తాజా పరిణామాలను బట్టి ఆయనకు టికెట్ దక్కడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ నుంచి నలుగురు పార్లమెంటు సభ్యులు కొనసాగుతుండగా ముగ్గురికి మళ్లీ టికెట్లు ఖరారు చేసిన అధిష్టానం ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయంకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. తదుపరి జాబితాలో చోటు దక్కుతుందా లేదంటే ఆయన స్థానంలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తారా అన్నది కాషాయ పార్టీలో ఉత్కంఠ రేపుతుంది.
కొత్త అభ్యర్థి వైపే మొగ్గు..?
ఆదివాసీ సంఘాల నేతగా తుడుందెబ్బ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా సోయం బాపూరావు రాజకీయాల్లోకి వచ్చారు. బోథ్ శాసనసభ్యుడిగా రాజకీయ ప్రస్థానం మొదలైన సోయం బాపూరావు భారత్ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలలో కొనసాగారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో చివరి క్షణంలో బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. అయితే అనేక వివాదాస్పద ఘటనలో ఆయన రాజకీయంగా పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన నలుగురు శాసనసభ్యులు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే కొత్త అభ్యర్థి విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితి పార్టీలో కొనసాగుతున్న మాజీ ఎంపీ జీ నగేష్ త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతుండగా... మరికొందరు నేతలు కూడా బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ ఆదివాసి వర్గానికే టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లయితే... మళ్లీ సోయం బాపూరావుకే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఆయనకు ఇవ్వకపోతే భారత రాష్ట్ర సమితి నుంచి ఖచ్చితమైన హామీతో పార్టీలో చేరితే మాజీ మంత్రి జి నగేష్‌కు టికెట్ ఖాయమే. ఇక లంబాడి సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పేరు బలంగా వినిపిస్తున్నది. మరోవైపు బైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్ బాబు పేరు కూడా వినిపిస్తోంది.
ఆయన ఇతర అభ్యర్థుల కన్నా ఎక్కువగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సినీ నటుడు అభినవ్ సర్దార్ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇలా పార్టీలో అనేకమంది టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ అధిష్టానం పై ఒత్తిడి తీసుకు వస్తుండడంతో టికెట్ ఖరారు విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అభ్యర్థులను ప్రకటించిన తొలి జాబితాలో సోయం పేరు లేకపోవడంతో ఆయనతోపాటు ఆయన వర్గీయులను ఆందోళనకు గురిచేస్తోంది.
రేపటి ప్రధాని సభ సమయంలోనే...
కాగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనకు రెండు రోజుల ముందుగా పార్టీ తొలి జాబితా విడుదల చేయగా... అందులో సెట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పేరు లేకపోవడం పార్టీ వర్గాల్లో భిన్న రకాల చర్చకు దారితీస్తోంది.