నిద్రపోతున్న.. నిఘా నేత్రాలు..

మండల కేంద్రంలోని చౌరస్తాలు, గ్రామ పొలిమేరల్లో సీసీ కెమెరాలు ఉన్నా అవి పని చేయడం లేదు.

Update: 2024-12-30 07:55 GMT

దిశ, బోథ్ : మండల కేంద్రంలోని చౌరస్తాలు, గ్రామ పొలిమేరల్లో సీసీ కెమెరాలు ఉన్నా అవి పని చేయడం లేదు. దోపిడీలను అరికట్టేందుకు గ్రామ అభివృద్ధి కమిటీలను ప్రోత్సహించి గతంలో పోలీస్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అయితే వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ఫలితంగా దొంగతనాలు జరిగినా దొంగలు తప్పించుకు తిరుగుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి హనుమాన్ వాడలో పార్క్ చేసి ఉన్న బ్యాంకు ఉద్యోగికి చెందిన కారును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. అంతే కాకుండా ఆదివారం సాయంత్రం సమయంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడి మోటార్ సైకిల్ ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

ఇటీవలే మండలంలోని కౌట బి గ్రామంలో రెండు ఎడ్లను కూడా దొంగలు తీసుకువెళ్లారు. ఆ గ్రామంలో సైతం సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల దొంగలు దొరకకుండా పోయారు. సీసీ కెమెరాల నిర్వహణ సక్రమంగా ఉంటే దొంగతనాలు చేయడానికి సైతం వెనుకడుగేస్తారు. చౌరస్తాలు, గ్రామ ముఖద్వారాలు, రద్దీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణను గాలికొదిలేశారు. సీసీ కెమెరాల నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల నేర నియంత్రణ కొంతమేరకు అయినా తగ్గించవచ్చు అని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సై ప్రవీణ్ ను వివరణ కోరగా ప్రధాన కూడళ్ళలో సీసీ కెమెరాలను బాగు చేయించాం. అక్కడక్కడ కోతులు కూడా కేబుల్ వైర్లను తెంపివేయడం, కెమెరాలను విరగ్గొడుతున్నాయని త్వరలో మిగితా సీసీ కెమెరాలు కూడా బాగు చేయిస్తామని తెలిపారు.


Similar News