రోగం చిన్నదైనా జేబులకు చిల్లే.. అర్హతలేని వారితో ల్యాబుల్లో టెస్టులు

ప్రైవేట్ దవాఖానాలు ఇష్టారాజ్యమైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

Update: 2024-09-07 02:17 GMT

దిశ,ఆసిఫాబాద్:ప్రైవేట్ దవాఖానాలు ఇష్టారాజ్యమైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చిన్నపాటి దగ్గు జలుబు ఒంటి నొప్పులతో ఆసుపత్రులకు వెళితే జేబుకు చిల్లు తప్పడం లేదు. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు రోగి అనుమానాలకు మరింత భయాన్ని జోడిస్తున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు రాస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో జరిపే పరీక్షలు పూర్తిగా పనికి రావాలంటూ వారు సూచించిన డయాగ్నొస్టిక్ సెంటర్‌లో మాత్రమే పరీక్షలు జరిపించాలని చెబుతున్నారు. రోగికి మెరుగైన వైద్యం అందించాలంటే రక్త మూత్ర పరీక్షలు తప్పనిసరి..ఇదే ఇప్పుడు ప్రైవేటు దవాఖానాలకు కాసుల పంట కురిపిస్తున్నాయి. కనీసం అవగాహన, అర్హత లేని వారితోనే ల్యాబ్ టెస్టులు జరిపించి వారిచ్చే రిపోర్టు ఆధారంగానే డాక్టర్ వైద్యం చేస్తున్నారు. ఫలితంగా అవసరం లేని మందులతో కొత్త రోగులు కొనితెచ్చుకుని రోగులు నిండా మోసపోతున్నారు. ఈ తతంగం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్ దవాఖానాలు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కేవలం వాంకిడి మండలంలోనే దాదాపుగా 15 కు పైగా ప్రైవేటు దవాఖానాలున్నా యి. ఇక జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ దవాఖానాల్లో తగిన వసతులు లేకున్నా రోగి నుంచి రూ.వందల్లో ఓపీ ఫీజులు గుంజుతున్నారు. చిన్నపాటి దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రికి వెళ్తే రోగులను మరింత భయభ్రాంతులకు గురి చేసి టెస్టులు రాస్తున్నారు. రోగుల నుంచి ఒక్కో టెస్టుకు రూ 500 నుంచి 2 వేల వసూళ్లు చేస్తున్నారు.

ల్యాబుల్లో అధిక వసూళ్లు..

ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు సూచించిన ల్యాబుల్లో చేసిన టెస్టులకు డాక్టర్ కమిషన్ 40 శాతాన్ని కలిపి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ నిర్దారణ టేస్ట్ కోసం ప్రైవేటు ల్యాబుల్లో రూ 1 వెయ్యి నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నారు. మలేరియా. టైఫాయిడ్ వంటి వాటికి కూడా రోగులు నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఏఎస్పీ థైరాయిడ్. హెచ్ఐవి. వీడీఅర్ఎల్. పసిపిల్లలకు బిల్ రూబిన్. పెద్దవారికి ఎల్ఎఫ్‌టీ. లివర్ ఫంక్షనింగ్ . తలసేమియా వంటి వాటికి కూడా డాక్టర్ కమిషన్ కలిపి రోగుల నుంచే వసూళ్లు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.

పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు..

జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో అర్హత లేకున్నా పీఎంపీ.ఆర్ఎంపీలు స్థాయికి మించిన వైద్యం చేస్తున్నారు. రోగి పరిస్థితి చేయి దాటి సందర్భాల్లోనూ ఆర్ఎంపీలు పట్టణాల్లోని ప్రైవేట్ దవాఖానాలకు రెఫెర్ చేసి కమిషన్ దండుకుంటున్నారు. అంతేకాకుండా జిల్లా చాలా దవాఖానాలు అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. తరుచూ పర్యటించి పర్యవేక్షించాల్సిన జిల్లాస్థాయి అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తుండడం తో ప్రజల ప్రాణాలకు భరోసా కరువయ్యింది. ఇప్పటికైనా జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించి అనుమతి. అర్హత లేని డాక్టరు. ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.


Similar News