రేపట్నుంచి ఏలేటి జోడో యాత్ర..!
కాంగ్రెస్ పార్టీలో మరో కౌంటర్ యాత్ర మొదలవుతున్నది.
దిశ ప్రతినిధి, నిర్మల్ : కాంగ్రెస్ పార్టీలో మరో కౌంటర్ యాత్ర మొదలవుతున్నది. అధిష్టానం అనుమతి ఉందా లేదా అన్న విషయం పక్కనపెడితే... పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తొలి నుంచి విభేదిస్తున్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించిన ప్రకారం పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో పర్యటనలు చేసుకునేందుకు అనుమతి ఉందని చెబుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా మహేశ్వర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన పాదయాత్రను ప్రారంభిస్తుండడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇది పక్కాగా రేవంత్ రెడ్డికి కౌంటర్ యాత్ర గానే కాంగ్రెస్ లోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని బైంసా నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారు.
ముధోల్ నిర్మల్ ఖానాపూర్ నియోజకవర్గాల మీదుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం దాకా మహేశ్వర్ రెడ్డి తన పాదయాత్రను చేపట్టనున్నారు. ఈ మేరకు ఈనెల 15వ తేదీ దాకా ఆయన పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది ఆయన పర్యటన వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నది. అయితే తన యాత్రకు ఏఐసీసీ అనుమతి ఉందని మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తననివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పాదయాత్ర విషయాన్ని స్పష్టం చేశారు. తాను చేపట్టే యాత్రకు ఏఐసీసీ అనుమతి ఉందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాక్రే శనివారం హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తన పాదయాత్రను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేదాకా కార్యకర్తలు చిత్తశుద్ధితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.