బాల్యవివాహ రహిత సమాజం కోసం కృషి చేయాలి
కంప్యూటర్ కాలంలో కూడా బాల్యవివాహాలు చేయటం బాధాకరమని, అలాంటి వివాహాలు లేని సమాజం కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.
దిశ, ఆదిలాబాద్ : కంప్యూటర్ కాలంలో కూడా బాల్యవివాహాలు చేయటం బాధాకరమని, అలాంటి వివాహాలు లేని సమాజం కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా గళం విప్పి చెబితే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి అన్ని శాఖల తరఫున రక్షణ కల్పించేందుకు పనిచేస్తున్నాయని, చట్టాలు బాలల హక్కుల సంరక్షణ పనిచేస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు, బాల కార్మికుల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీఓ రాజేంద్రప్రసాద్, మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ పవర్ యశోద, సఖి కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, సీడీపీఓ వనజ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీఓ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎంత కష్టమొచ్చినా చదువును మధ్యలో ఆపివేయొద్దని అన్నారు. చదువులో ఏదైనా ఇబ్బంది వస్తే ధైర్యంగా తమ టీచర్లకు చెప్పుకోవాలన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం 1098, 100, మహిళల కోసం 181 హెల్ప్ లైన్ నెంబర్లు, షీ టీం సభ్యులు 24 గంటల పాటు పనిచేస్తున్నారన్నారు. పిల్లల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాల్యవివాహాలతో జీవితం అక్కడే ముగిసిపోతుందని అన్నారు. ఇందుకోసం పిల్లలందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మధ్యలో మానివేయకుండా పూర్తి చేయాలన్నారు.
బలవంతంగా పెళ్లికి తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా ఇబ్బంది పెడితే 1098 హెల్ప్ లైన్ నెంబర్ కు సంప్రదించాలన్నారు. అదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఇతర దేశాలలో సైతం చదువుకుంటున్నారని, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. భయపడకుండా 181,100,1098 కు టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలన్నారు. అనంతరం షూర్ ఎన్జీవో రూపొందించిన బాల్య వివాహ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పరిహిన్ సుల్తానా, షూర్ ఎన్జీవో డిస్టిక్ కోఆర్డినేటర్, ఫీల్డ్ సూపర్వైజర్ తోట సుమలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ నిర్మల, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.