పండుగ పూట..ట్రాఫిక్ ఇక్కట్లు.. ప్రేక్షక పాత్రలో పోలీసులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పండగ పూట ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు

Update: 2024-09-07 08:45 GMT

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పండగ పూట ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. పండుగలు వస్తే చాలు బెల్లంపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య హడలెత్తిస్తోంది. పట్టణం నడిబొడ్డున బజార్ ఏరియా వ్యాపార విపణి కేంద్రం. కాగా వ్యాపార వాణిజ్య బజార్ ఏరియాలో నిత్యం సందడిగానే ఉంటుంది. పండగల సందర్భంగా బజార్ ఏరియా ప్రజలతో కిక్కిరిసి కనిపిస్తుంది. ప్రధాన మార్కెట్ రహదారి వ్యాపార దుకాణాల వీధుల్లో సందడి పోటెత్తింది. ఈ క్రమంలో ట్రాఫిక్ కు సమస్యలు వర్ణనాతీతం. ప్రధానంగా మార్కెట్ ఏరియాలో ద్విచక్ర వాహనాలు రోడ్లపైనే నిలిపి ఉంటాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా దుకాణాలు ఫుట్ పాత్ పై వెలువడడంతో ట్రాఫిక్ కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. కూరగాయల వ్యాపారస్తులు రోడ్లపైనే విక్రయాలు, మరోవైపు మార్కెట్ ప్రాంతం మీదుగా బస్సుల రాకపోకలు ఇబ్బంది గా మారాయి. రోడ్ల పక్కనే వ్యాపార సముదాయాలు, వాహనాల పార్కింగ్ తో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.

కనిపించని ట్రాఫిక్ పోలీసులు..

పండుగను పురస్కరించుకొని మార్కెట్ ప్రాంతం వినియోగదారులతో కళకళలాడుతోంది. వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ ఇక్కట్లు విషమంగా మారాయి. ట్రాఫిక్ సమస్య ప్రమాదాలకు దారితీయకుండా పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలి.కానీ రెండు రోజులుగా బెల్లంపల్లి ప్రధాన మార్కెట్ ప్రాంతంలో క్రయవిక్రయాలతో కోలాహలంగా మారిపోయింది. కాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ట్రాఫిక్ సందడి మరి తీవ్రంగా ఉంది. ప్రధాన కూడలిలో ఒక కానిస్టేబుల్ కూడా ట్రాఫిక్ కంట్రోల్ కు కనిపించిన పాపాన పోలేదు. బస్సులు, పార్సల్ గూడ్స్ వాహనాలు ,ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకల క్రమంలో ప్రమాదాలు నిత్యం పొంచి ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పండుగల వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యపై నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ ప్రమాదాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News