దంచి కొడుతున్న వానలు.. నిలిచిన రాకపోకలు..

ముదొల్ తాలూకా, భైంసా మండలం వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి వానలు దంచికొడుతున్నాయి.

Update: 2024-09-01 08:04 GMT

దిశ, భైంసా : ముదొల్ తాలూకా, భైంసా మండలం వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి వానలు దంచికొడుతున్నాయి. పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా గుండె గావ్ వద్ద రాకపోకలు నిలిచిపోగా, గ్రామ స్మశాన వాటిక సైతం వరద నీటిలో మునిగిపోయింది. మహాగావ్ గ్రామంలో పాత ఊరు, కొత్త ఊరు మధ్య వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు కొద్దిమేర ఆటంకం ఏర్పడుతుంది. మహగావ్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో సైతం వరద నీరు చేరింది. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంట గంటకి వరద నీరు పెరుగుతుంది. కుంటాల మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వెంకూరు, ఓల గ్రామాల మధ్యగల వెంతెన పై నీరు ప్రవహించగా, మరోపక్క తానూరు మండలంలోని జరి(బి) వంతెన పై వరద నీరు ప్రవహించి రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుంది.

ప్రజలు అప్రమతతంగా వుండాలి.. అధికారులు, నాయకులు

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళరాదని, తడిసిన కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప స్తంభాలు తాకకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని తాలూకా ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావ్ పటేల్, తాలూకా కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావ్ పటేల్, అధికారులు ప్రజలకు సూచించారు.


Similar News