బుట్ట చోర్ మాటలు ఇక నమ్మొద్దు..!
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చెప్పే బుట్ట చోర్ మాటలు ఇక ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు.
దిశ, భైంసా: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చెప్పే బుట్ట చోర్ మాటలు ఇక ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోదం నగేష్ పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నామని, స్థానిక కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతున్నారని, ఎన్ని చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికైన 100 రోజుల్లోనే తాలుకాకి రూ. 140 కోట్లతో అభివృద్ధి పనులు తెచ్చిన ఘనత తమది అన్నారు. కేంద్ర అధికారంలో తామున్నామని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని రాష్ట్రంలో పాలన సాగాలంటే కేంద్రం పై ఆధారపడాల్సిందేనన్నారు. ప్రజా ఆశీర్వాదంతో గెలిచానని, ప్రజల కోసమే పని చేస్తానని, అధికారం కోల్పోయిన వారు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రధాని పాలనలోనే దేశం సురక్షితం : అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోదం నగేష్
ప్రధాని మోదీ పాలనలోనే దేశం సురక్షితంగా ఉంటుందని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోదం నగేష్ అన్నారు. గత పది సంవత్సరాలుగా దేశాన్ని సురక్షితంగా పటిష్టంగా మలిచిన ఘనత మోదీదని అలాంటి కష్టపడే నాయకత్వం, మంచి విలువలున్న బీజేపీ పార్టీలో చేరడం నా అదృష్టమని అన్నారు. బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా పని చేస్తారని, పార్టీ నాకేమిచ్చింది అన్నదానికన్నా, పార్టీకి నేనేమి ఇచ్చానని అనుక్షణం బీజేపీ కార్యకర్తలు పరితపిస్తారన్నారు. గతంలో జరిగిన భైంసా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో తన ఓటును అప్పటి పార్టీ అధిష్ఠాన సూచన మేరకే వినియోగించుకున్నాను తప్ప మరే ఉద్దేశం లేదన్నారు. అదే విషయంమయి కొందరు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉందని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా ఆశీర్వదిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యేతో కలిసి తాలుకాను మరింత అభివృద్ధి పరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.