కదం తొక్కిన కొలంలు..ఐటీడీఏ ముందు ధర్నా
మన్నేవార్లలకు ప్రభుత్వం కేటాయించిన కొలవార్ పదాన్ని
దిశ,ఉట్నూర్ : మన్నేవార్లలకు ప్రభుత్వం కేటాయించిన కొలవార్ పదాన్ని తొలగించాలని ఆదివాసీ కొలం ప్రజలు కదం తొక్కారు. ఆదిమ గిరిజన కొలం సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున కోలం సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టేకం భాస్కర్, జిల్లా అధ్యక్షుడు మడవి గోవింద్ రావ్, రాష్ట్ర, జిల్లా నాయకులు బాలే రావ్, నగేశ్, భీమ్రావ్, మహేష్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కొలం ప్రజలు నివాసం ఉంటున్నమన్నారు.
తాము పీవీటీజీ జాబితాలో ఉన్నామని, పూర్వీకుల నుండి తాము మాతృ భాష గా కొలం మాట్లాడుతున్నమని అప్పటి నుండి కొలవార్ గా ప్రభుత్వం కొలావార్ గా గుర్తించిందన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన్నేవార్లను కూడా కోలవార్ గా ప్రకటనపై సమస్త కొలావార్ సమాజం అంత అసహనం వ్యక్తం చేస్తుందనీ, ఈ పదాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాలు కమిటీలను వేయాలన్నారు. 2021లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మన్నెవార్లను పీవీటీజీలు గా గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని, ఇప్పటి వరకు మన్నేవార్లకు కొలావార్ గా జారీచేసిన సర్టిపికెట్లలన్నిటింటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజనులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు.సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆందోళన సుమారుగా గంటన్నర పాటు సాగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం నాయకులు, కొలం ప్రజలు పాల్గొన్నారు.