అసైన్డ్ భూముల్లో క్రషర్లు… నిబంధనలను పట్టించుకోని యాజమాన్యాలు

సొన్ కూచన్ పల్లి గ్రామాలకు అతి సమీపంలో కంకర క్రషర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Update: 2024-10-07 11:44 GMT

దిశ, సొన్: సొన్ కూచన్ పల్లి గ్రామాలకు అతి సమీపంలో కంకర క్రషర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఉన్న క్రషర్లతో ఇబ్బందులు పడుతుంటే వాటిని ఏర్పాటు చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రైతులు సాగు చేసుకోవాల్సిన అసైన్డ్ భూముల్లో ఏకంగా క్రషర్లను ఏర్పాటు చేసి, దీంతో పాటు పేద ప్రజలకు గవర్నమెంట్ ఇచ్చిన భూముల్లో రాజకీయ నాయకుల అండదండలతో కంకర మిషన్లు ఏర్పాటుచేసి, క్వారీలు ఏర్పాటుకు అధికారులు కేటాయించడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సొన్ గ్రామ శివారులో గల 495 సర్వే నెంబర్ లో క్రషర్ ఏర్పాటు చేసి 20 సంవత్సరాల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

అప్పట్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కంకర క్రషర్ల ఏర్పాటుకు తాము పూర్తిగా వ్యతిరేకమని ప్రజలు, రైతులు తెగేసి చెప్పారు. అయినా కూడా అధికారుల, రాజకీయ నాయకుల అండదండలతో సొన్ సరిహద్దు ప్రాంతంలో క్రషర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులను ఇచ్చారు. ప్రస్తుతం సొన్ గ్రామ శివారులో ఆరు కంకర క్రషర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం ధనలక్ష్మి క్రషర్ అసైన్డ్ భూముల్లో క్రషర్లు కొనసాగిస్తోంది. అయినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని వారి భూములను ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చిన కానీ వారికి ఇప్పటికీ కూడా వారి భూములను వారికి ఇవ్వకుండా అక్రమంగా ధనలక్ష్మి క్రషర్ నడిపిస్తున్నారని భూముల యజమానులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధనలక్ష్మి క్రషర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News