ప్రైవేటు వైపే పత్తి రైతు మొగ్గు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతు మరోసారి మోసం అంచున దోపిడీకి గురవుతున్నాడు.

Update: 2024-11-16 02:17 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతు మరోసారి మోసం అంచున దోపిడీకి గురవుతున్నాడు. సీసీఐ ప్రకటించిన మద్దతు ధర ఇస్తున్నప్పటికీ చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా పత్తి రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి గతంతో పోలిస్తే పత్తి పంట భారీగానే దిగుబడి వచ్చింది. సీసీఐ మద్దతు ధర 7521 రూపాయలతో కొనుగోలు చేస్తుంటే... ప్రైవేటు వ్యాపారులు 300 రూపాయల తక్కువతో కొనుగోలు చేస్తున్నారు. ఇక పత్తిలో తేమ పేరుతో 7 వేలలోపే ధరతో ఉంటున్న ఆరోపణలు ఉన్నాయి. అధికార యంత్రాంగం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో బైంసా, ఆదిలాబాద్, నిర్మల్, కుబీర్, బోథ్, సోనాల, ఇచ్చోడ, జైనోర్, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి తదితర మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు సాగుతున్నాయి.

సీసీఐకి అమ్మితే అగచాట్లు..

పత్తి రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మద్దతు ధర ఎక్కువగానే ఉన్నప్పటికీ చెల్లింపుల విషయంలో చేస్తున్న జాప్యం రైతులను ప్రైవేటు వైపు మళ్ళిస్తున్నది. రైతులకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తుండడం దీనికి ప్రధాన కారణం. అందులోనూ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ తప్పనిసరి అన్న కారణాన్ని సీసీఐ విధించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ప్రైవేటు వ్యాపారులు ఆసరాగా తీసుకుంటున్నారు. తమ వద్దకు వస్తే వెంటనే చెక్కులు ఇస్తుండడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అమ్ముకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

చెక్కులు కాకుండా వెనువెంటనే నగదు కావాలంటే రైతుల వద్ద నుంచి రెండు నుంచి మూడు శాతం డబ్బులు కట్ చేసుకుని ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వ్యాపారులకు లాభ సాటిగా మారుతున్నది. సీసీఐ నిబంధనలను సరళతరం చేస్తే రైతులకు ప్రతి క్వింటాలు పై 300 నుంచి 600 దాకా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు వ్యాపారులు నగదు చెల్లింపుల ఆశ చూపి తక్కువ ధరతో కొనుగోలు చేయడం, వెంటనే నగదు కావాలంటే రెండు నుంచి మూడు శాతం డబ్బుల్లో కోత విధించడం, మరోవైపు తేమ పేరుతో ధర తగ్గించడం వంటి కారణాలతో రైతులను తీరని అన్యాయానికి గురి చేస్తున్నారు. ఒక్కసారి కాటన్ మిల్లులోకి పత్తి బండ్లు వెళితే వెనక్కి తిరిగి వచ్చే దారి లేకపోతుండడంతో రైతులు ధరలో భారీగా నష్టం జరుగుతున్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకునే పరిస్థితి నెలకొంది.

చెల్లింపులలో సీసీఐ జాప్యం...

ఉదాహరణకు నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు సీసీఐ ద్వారా 602 మంది రైతుల వద్ద 13 వేల 679 క్వింటాళ్లు పత్తి కొనుగోలు చేశారు. దీని విలువ రూ. 7 కోట్ల 78 లక్షలు కాగా, 455 మంది రైతులకు రూ. 5 కోట్ల 33 లక్షల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాగా మరో 200 మంది రైతులకు రెండున్నర కోట్ల మీద చెల్లింపులు జరగాల్సి ఉంది. ఇలాంటి కారణాలతో పత్తి రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇలా చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో రైతులు పత్తి పంటను ఇంట్లో దాచుకోలేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారు. సీసీఐ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు లంకె పెడుతుండడంతో ఇదంతా ఓ తల నొప్పిలా రైతులు భావిస్తున్నారు. సీసీఐ అధికారులు రైతులకు మద్దతు ధర పై భరోసా ఇస్తూనే చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రైతులు ప్రైవేటుకు అమ్మి మోసపోవద్దని సీసీఐ రైతులకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది బాగానే ఉన్నప్పటికీ నగదు చెల్లింపుల విషయంలో కొంత జాప్యం జరుగుతుండడం కారణంగా రైతులు సీసీఐ కన్నా ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నాయి.

Tags:    

Similar News