చలి పంజా.. వణుకుతున్న ఆదిలాబాద్ మన్యం

తీవ్రమైన చలితో ఆదిలాబాద్ మన్యం వణుకుతున్నది.

Update: 2024-12-17 03:08 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : తీవ్రమైన చలితో ఆదిలాబాద్ మన్యం వణుకుతున్నది. రెండు రోజులుగా చలితో పాటు ఈదురుగారుల కారణంగా జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. తెలంగాణలోనే అత్యంత ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో సమాచారం లేకపోగా... ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆర్లి గ్రామంలో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే దీన్ని అధికార వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు.

ఆరు డిగ్రీల నమోదు గజగజ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాల్లో విపరీతమైన చలి పెరిగింది. సాయంత్రం 6:00 కాకముందే ఈ ప్రాంతాల్లో చీకటి పడుతున్నది. ఉదయం ఏడు గంటలకు దాటితే గాని పొగమంచు వీడడం లేదు. ఏడు గంటల తర్వాతనే తెల్లారిన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది ఇది జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతగా అధికారులు చెబుతున్నారు. ఇక ఉట్నూరు ఏజెన్సీలోని సిర్పూర్ యు మండలం పరిసర గ్రామంలో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరి గ్రామంలోనూ 8° ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ పరిస్థితులతో జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత కారణంగా సాయంత్రం ఐదు నుంచి ఉదయం ఎనిమిది గంటల్లో దాటి దాకా ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. చలి తీవ్రత కారణంగా వృద్ధులు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సంబంధ వ్యాధులు విపరీతంగా ప్రబలే ప్రమాదం ఉంది. అలాగే చర్మ సంబంధ రోగాలు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత నుంచి పిల్లలు వృద్దులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. చెవులు తల మూసి ఉండేలా మంకీ క్యాప్ ఖచ్చితంగా వాడాలని సూచిస్తున్నారు. అలాగే స్వెటర్, హ్యాండ్ గ్లౌజ్, సాక్స్ వాడటం ద్వారా చలి నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు.


Similar News