బీఆర్ఎస్ ఇంచార్జీల మార్పు..?

పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆసిఫాబాద్ మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీ నేతల తీరే కారణమా..?

Update: 2024-12-28 03:05 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆసిఫాబాద్ మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీ నేతల తీరే కారణమా..? అంటే అవుననే అభిప్రాయాలు ఆ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలు, నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీని పై పార్టీ అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రెండు స్థానాల్లో గెలుపొందిన కారు పార్టీ... పార్లమెంట్ ఎన్నికల నాటికి అత్యంత దయనీయ స్థితికి చేరి మూడో స్థానానికి పరిమితమైంది.

పార్టీ బరిలో దింపిన అభ్యర్థి ఆత్రం సక్కు రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా మంచి వ్యక్తిగా పేరు ఉన్నప్పటికీ మూడో స్థానానికి పడిపోవడం... అందులోనూ ఓట్లు ఆశించిన స్థాయిలో పార్టీకి పోల్ కాకపోవడం అధిష్టానం ఆరా తీసినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం భారీగానే ఫండింగ్ చేసిందని... ఆ డబ్బులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల దాకా అందకపోవడం వెనుక భారీగా చేతివాటం జరిగిందన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. అలాగే పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మూడు నియోజకవర్గాల పరిధిలోను ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇంచార్జుల మార్పు జరగనుందన్న ప్రచారం మొదలైంది.

చేతివాటం పై అధిష్టానం సీరియస్...

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే... పార్టీకి ఓట్ల సంఖ్య తగ్గకుండా గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. ఇందులో భాగంగానే పలు పార్లమెంటు స్థానాలు ఓడిపోతాయని తెలిసి కూడా భారీగా ఫండింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. బలమైన అభ్యర్థులను సైతం రంగంలోకి దింపారు. కానీ పలు నియోజకవర్గాల్లో డబ్బులకు కక్కుర్తి పడ్డ గులాబీ నేతలు పార్టీ పంపిన డబ్బులను సైతం ఖర్చు చేయకుండా సొంత ఖాతాలో జమ చేసుకున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాంటి పలువురు నేతల సమాచారం అధిష్టానం సేకరించినట్లు తెలుస్తున్నది. పలువురు పేరు ఉన్న ముఖ్య నేతలు సైతం అధిష్టానం పంపిన ఎన్నికల ఖర్చులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు అధిష్టానానికి అందాయి. దీని పై పార్టీ అగ్రనేత కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఆగ్రహంతో ఉన్నట్లు కూడా తెలుస్తున్నది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కొందరు ముఖ్య నేతలు కార్యకర్తలతో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. చేతివాటం ప్రదర్శించిన పలువురు నియోజకవర్గాల ఇంచార్జితో పాటు, ఒక జిల్లా నేత సీనియర్ ఒకరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని వారి పై వేటు వేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

స్థానిక ఎన్నికలకు ముందే మార్పు..

రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు పలువురు నియోజకవర్గాల ఇంచార్జీను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పంపిన పార్టీ ఫండ్ కాజేసిన నియోజకవర్గ ఇంచార్జిను తొలగించేందుకు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మరోవైపు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారికి నియోజకవర్గ ఇంచార్జీలు జిల్లా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అగ్రనేతలను త్వరలోనే జిల్లాకు పంపనున్నట్లు తెలిసింది.

సక్కు ఇచ్చిన నివేదిక కీలకమైందా..?

పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత భారత రాష్ట్ర సమితి రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమీక్షలో ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆత్రం సక్కు ఇచ్చిన నివేదిక పార్టీ అధిష్టానం కీలకంగా భావించినట్లు తెలిసింది. ఆయన తన పార్లమెంటు పరిధిలో ఉన్న పలు నియోజకవర్గ ముఖ్య నేతలు ఇంచార్జుల పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఆ పరిస్థితుల్లో అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో పలుసార్లు ఆయన ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడంతో రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఈ పర్యవసానం తర్వాతనే గులాబీ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తున్నది.


Similar News