బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి మార్పు.. తెరపైకి ఏమాజీ..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో స్థిరత్వం లేని పరిస్థితి చోటుచేసుకుంది.
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో స్థిరత్వం లేని పరిస్థితి చోటుచేసుకుంది. దానికి రాజకీయ సమీకరణలు, పార్టీల ఫిరాయింపులు. అభ్యర్థులను మార్చడం అతీతం కాని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి కొనసాగారు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు. అయినప్పటికీ మార్పులకు చేర్పులకు ఏది అడ్డుకాని పరిస్థితి నెలకొంది. బీజేపీ అధిష్టానం శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి కొయ్యల ఎమాజీని బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ మార్పు ఆ పార్టీ అంతర్గత విషయమైనప్పటికీ బీజేపీ అధిష్టానం అభ్యర్థుల మార్పునకు పూనుకోవడం జిల్లాలో చర్చననీయాంశమైంది. బీజేపీ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటించినప్పటి నుంచి కోయ్యల ఏమాజీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. నియోజవర్గంలో ధర్నాలు, రాస్తారోకోలు హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి బస్సు యాత్రతో ముట్టడికి వెళ్లారు.
కొయ్యల ఏమాజీ అలుపెరుగని నిరసన నేపథ్యంలో అధిష్టానం తొలుత ప్రకటించిన బీజేపీ అభ్యర్థి శ్రీదేవి పేరును మార్చడం తప్పలేదు. బెల్లంపల్లి అభ్యర్థిగా కొయ్యల ఏమాజీ పేరును ప్రకటించడం హాట్ టాపిక్ గామారింది. కొయ్యల ఏమాజీ 2018లో బీజేపీ అభ్యర్థిగా బెల్లంపల్లిలో పోటీ చేశారు. ఆయనను కాదని ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికి టికెట్ ఇవ్వడం బీజేపీలో ముసలానికి తెరతీసింది. అధిష్టానం నిర్ణయం పై ధర్మాగ్రహాన్ని ప్రదర్శించిన కొయ్యల ఎమాజీ శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని రద్దుచేసి తిరిగి తనకు టికెట్ ఖరారు చేయాలని అధిష్టానం పై చేసిన ఒత్తిడి ఎట్టకేలకు ఫలించింది. ఆయన మద్దతు దారులల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.
రెండు రోజుల నుంచి కోయ్యల ఏమాజీ హైదరాబాదులో మకాం వేసి టికెట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఖరారు చేసి బీఫామ్ అప్పజెప్పినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అభ్యర్థిత్త్వం మున్నాల ముచ్చటగానే మిగిలిపోయింది. అధిష్టానం నమ్మించి మోసం చేసిందని మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫీలవ్వడం కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థిగా కొయ్యల ఏమాజీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన మద్దతుదారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీదేవి దారి ఎటు..?
మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీ అభ్యర్థిత్వాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఆమె భవిష్యత్తు కార్యాచరణ పై చర్చ జోరుగా జరుగుతుంది. ఇటీవలనే బీజేపీలో చేరిన ఆమెను బెల్లంపల్లి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీలో కొయ్యల ఏమాజీ రెబల్ గా మారి ఆమె టికెట్ రద్దు చేపించిన నేపథ్యంలో శ్రీదేవి నమ్మక ద్రోహానికి గురి కావడం ఆమె మద్దతుదారులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీలో ఉండడమా..? రాజీనామా చేయడమా..? ఆమె రాజకీయ భవిష్యత్తునిర్ణయం ఎలా ఉంటుందని దానిపై ఆసక్తి నెలకొంది.