రుణం తీర్చలేదని రైతులపై బ్యాంకర్ల ప్రతాపం..రికవరీ కోసం ఇంటి తలుపుల ఊడదీత

వెనుక నుంచి ఏనుగులు పోయిన పర్వాలేదు కానీ ముందు

Update: 2024-09-25 15:22 GMT

దిశ,బెల్లంపల్లి : వెనుక నుంచి ఏనుగులు పోయిన పర్వాలేదు కానీ ముందు నుంచి పీనుగులు వెళ్ళొద్దన్నట్టు ఉన్నది బ్యాంకర్ల సంగతి. డీసీసీబీ బ్యాంక్ రుణం తీసుకున్న ఓ రైతు బకాయిలు చెల్లించలేదని బ్యాంకర్లు ఆ రైతు ఇంటి తలుపులను దౌర్జన్యంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నెన్నల మండల కేంద్రంలో నేతకాని వాడకు చెందిన గట్టు శివ లింగయ్య, అతని సోదరుడు బానేష్ డీసీసీబీ బ్యాంకు నుంచి రూ. 3 లక్షల రుణం తీసుకున్నారు. రైతుల రుణ బకాయి చెల్లించలేదని బ్యాంకర్లు ఇద్దరు వారి ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగారు. బకాయి డబ్బులు చెల్లిస్తానని ఓవైపు వారు చెబుతున్నప్పటికీ అధికారులు ససేమీర అన్నారు. బకాయి పడిన డబ్బులు తీరుస్తామన్నప్పుడూ తీసుకోవాలి.

అంతేకానీ రైతులపై ప్రతీకారానికి దిగరాదు. అంతటితో ఆగకుండా అప్పు కింద ఇంటి తలుపులను తొలగించి నానా హంగామా చేశారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రజలు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ బ్యాంకు ఉద్యోగులు ఇంటి తలుపులను ధ్వంసం చేసేందుకు పూనుకోవడంపై రైతులు తిరగబడ్డారు. అప్పు చెల్లిస్తామన్నప్పుడు తీసుకెళ్లాలి. ఇవ్వకపోతే గడువు ఇవ్వాలి. అంతేకానీ ఇంటి దర్వాజాలు, తలుపులను ఊడదీసి అప్పు కింద తీసుకువెళ్లే హక్కెక్కడిదని స్థానికులు వారిని నిలదీశారు. అధికారులు రైతులతో వారికి మద్దతిచ్చిన గ్రామస్తులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన బ్యాంకర్ల చర్య పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. లక్షలకు, లక్షలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన పెద్దమనుషులు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది ఓ బక్క చిక్కిన రైతులు తీసుకున్న రుణాన్ని తీర్చడానికి డబ్బులు కాస్త ఆలస్యమైనందుకే అధికారులు ఇంత వీరంగం అవసరమా అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తీసుకున్న రుణానికి అప్పు కడతామని రైతులు మరీ చెప్పినప్పటికి అధికారులు వినిపించుకోలేదు. పైగా ఇంటి తలుపులు పగలగొట్టి అరాచకం చేశారు. ప్రభుత్వ బ్యాంకర్లకు ఇది తగునా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. బ్యాంకర్ల అనుచిత వ్యవహారం పై ప్రజలు ఆగ్రహంతో ఆ రైతు ఇంటి తలుపులు మిగిలాయి. లేకుంటే రుణ బకాయి కింద బ్యాంకు సిబ్బంది ఇంటి తలుపులు రికవరీ చేసేవారన్న చర్చ జోరుగా సాగుతోంది. రుణ వసూళ్లు చేయడం ఇలాగే ఉంటదానని బ్యాంకర్ల తీరుపై గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. అప్పు వసూలు కోసం బ్యాంకర్లు రైతులపై చూపిన ప్రతాపo గ్రామస్తులు తీవ్ర మండిపాటుతో ఊడబీకిన తలుపులను వదిలేసి ఇంటి ముఖం పట్టారు. రైతులపై బ్యాంకర్ల ఘనతపై ఆధ్యంతం చర్చించుకుంటున్నారు.


Similar News