విద్యార్థులు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

విద్యార్థులు కౌమారదశ నుంచే జీవన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

Update: 2024-09-24 13:53 GMT

దిశ, ఆదిలాబాద్ : విద్యార్థులు కౌమారదశ నుంచే జీవన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారుగూడ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఇందులో భాగంగా నూతనంగా విద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు డిగ్నిటీ హైజిన్ శానిటరీ పాడ్స్ మిషన్ ను విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని 18 కేజీబీవీలలోని విద్యార్థులకు లెర్నింగ్ కర్వే, భారత్ పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఏడాదికి సరిపడా శానిటరీ పాడ్స్, ఒక్కొక్క కేజీబీవీ కి ఒక్కొక్క ఇన్సినరేటర్ (శానిటరీ పాడ్స్ ను కాల్చివేసే యంత్రం) అందజేశారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌమారదశలో బాలికలకు శానిటరీ ప్యాడ్స్​ ఎంత అవసరమో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇన్సినరేటర్ కూడా అంతే అవసరం ఉంటుందని అన్నారు. దాని ద్వారా విద్యార్థులకు స్వాభిమానం, ఆత్మవిశ్వాసం ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ చదువును కొనసాగించవచ్చని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, ఆరోగ్య సంరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా వారు విజయానికి చేరువ అవుతారని తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి మూఢనమ్మకాలకు తావియ్యకుండా సరైన ఆరోగ్య పద్ధతులతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం కేజీబీవీలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత , కేజీబీవీల సంయుక్త అధికారి ఉదయశ్రీ , లెర్నింగ్ కర్వే సంస్థ అధికారి స్వప్న, బీపీసీఎల్ డీలర్ ముడుపు మౌనిష్ రెడ్డి,సేల్స్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. 

Tags:    

Similar News