అమ్మవారి గుడి అభివృద్ధిని వేగవంతం చేయండి... ఎమ్మెల్యే రామారావ్ పటేల్
దేశంలోనే ప్రసిద్ధి గాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ముథోల్ తాలూకాలో నెలకొని ఉండగా, అమ్మవారి అభివృద్ధిని వేగవంతం చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రస్తావించారు.
దిశ, భైంసా : దేశంలోనే ప్రసిద్ధి గాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ముథోల్ తాలూకాలో నెలకొని ఉండగా, అమ్మవారి అభివృద్ధిని వేగవంతం చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రస్తావించారు. గతంలో 50 కోట్లు మంజూరై వెనక్కి వెళ్ళగా, ప్రస్తుతం 42 కోట్లు మంజూరయ్యాయని, అభివృద్ధి ప్రారంభించి రాబోయే 2027 సంవత్సరం పుష్కరాలలోపు పూర్తి చేయాలన్నారు. దాతల రూపంలో పలువురు ఐదు కోట్ల వరకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్న నియోజకవర్గంలో 60 ఎకరాల భూమి అందుబాటులో ఉందని దీంట్లో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అగ్రికల్చర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. 6000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా బ్రహ్మేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ను 80 కోట్ల రూపాయలతో నిర్మిస్తే, గత పాలకుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్లు, పరికరాలు దొంగలు దోచుకెళ్లారని, సాగునీరు అందక ఆ ప్రాంత రైతులు వెనుకబడుతున్నారనీ, తక్షణమే వీటికి నిధులు ఇవ్వాలని కోరారు.
గడ్డెన్న వాగు ప్రాజెక్టు లక్ష్యం 14,000 ఎకరాలకు సాగునీరు కాగా, సీసీ లైనింగ్ పూర్తి చేయకపోవడంతో కేవలం 5000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని, 50 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి, సీసీ లైనింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 28వ ప్యాకేజీ కోసం నిధులు ఇచ్చారని, 50,000 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ప్యాకేజీ పనులు పది సంవత్సరాల కాలంలో ఏమాత్రం ప్రగతికి నోచుకోలేదన్నారు. తాలూకా వ్యాప్తంగా 310 చెరువులు కాగా, 120 చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా బాగు చేశారని, మరో 190 చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ద్వారా గుండె గాం వాసులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఇకనైనా తక్షణ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారని, తక్షణమే సంబంధిత శాఖ మంత్రి జీవో జారీ చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బైంసా ఏరియా ఆసుపత్రికి 100 పడకల నుంచి 150 పడకల ఆసుపత్రిగా అప్ గ్రెడ్ చేయాలని కోరారు. సంబంధిత శాఖ మంత్రులు సానుకూలంగా స్పందించారు.