వన్యప్రాణుల కోసం ఏసీలు.. ఎక్కడో తెలుసా?

వేసవికాలంలో ఎండల వేడికి బయటికి రావాలంటే జనం జంకుతున్నారు.

Update: 2023-04-03 02:30 GMT

దిశ, బహదూర్‌పురా : వేసవికాలంలో ఎండల వేడికి బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం వేసవికాలంలో జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడతారు.

ప్రత్యేక చర్యలు..

వన్యప్రాణులను వేసవి తాపం నుంచి రక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపారు. శనివారం ఆయన జూ కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందులో భాగంగా జూ పార్కులో శాఖాహార జంతువుల ఎన్‌క్లోజర్లలో 200 పై చిలుకు వాటర్ స్ప్రింకర్లను, రెయిన్ గన్‌లను ఏర్పాటు చేశారు.

జూ పార్కులోని రాప్టైల్ హౌస్‌లలో ఏవియరి ప్రాంతాలలో వెయ్యికి పైగా ఫాగర్లను ఏర్పాటు చేశారు. ఎన్‌క్లోజర్ నైట్ హౌస్‌ల పైకప్పులపై తుంగ గడ్డిని జూ సిబ్బంది అమర్చారు. డక్ పాండ్, కొంగ చెరువు ప్రాంతాలలో షేడ్ నెట్‌తో పాటు కోతులు, మాంసాహార ఎన్‌క్లోజర్లలో దాదాపు 80 ఎయిర్ కూలర్లను జూ అధికారులు సమకూర్చారు.

ఎయిర్ కండిషనర్లు

వన్య ప్రాణుల పిల్లల పెంపకం కేంద్రంలో ఎయిర్ కండిషనర్లను అమర్చారు. అన్ని జాతుల కోతులు, ప్రైమేట్స్, పక్షులు, ఎలుగుబంట్లకు వాటర్ మెలోన్, మస్క్ మెలోన్, సిట్రస్ వెరైటీ ఫ్రూట్స్ వంటి సీజనల్ పండ్లను జూ సిబ్బంది అందిస్తున్నారు. డీ-హైడ్రేషన్‌ను నివారించడానికి అన్ని జంతు గృహాలకు కాలానుగుణంగా చల్లని నీటిని అందుబాటులో ఉంచారు. వేసవి ఒత్తిడిని నివారించడానికి నీటిలో గ్లూకాన్-డి, ఎలక్ట్రాల్ పౌడర్, విటమిన్-సి సప్లిమెంట్లు, బి-కాంప్లెక్స్ సప్లిమెంట్లు, స్ట్రెస్‌వెల్, థర్మోకేర్ లిక్విడ్ వెటర్నరీ విభాగం ద్వారా జంతువులకు అందించబడుతుంది.

జంతువులపై నేరుగా సూర్యకాంతి పడకుండా ఉండేందుకు అన్ని యానిమల్ హౌస్ ఎన్‌క్లోజర్‌లకు కష్కష్ థట్టిలను కట్టారు. ఈ కష్కస్ తట్టిలపై రోజు మూడు నాలుగు సార్లు నీళ్లను జూ సిబ్బంది వెదజల్లుతున్నారు. అడవి జంతువులు, పక్షులు, సరీసృపాలను వేసవి ఒత్తిడి నుంచి కాపాడడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని క్యూరేటర్ తెలిపారు. దీనికోసం జంతు సంరక్షకులు, హెడ్ యానిమల్ కీపర్లు, పార్క్ సూపర్‌వైజర్‌లకు దిశానిర్దేశం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

Tags:    

Similar News