అభయహస్తం' నిధులు వాపస్.. త్వరలో మహిళల ఖాతాల్లోకి జమ

దిశ, తెలంగాణ బ్యూరో : సమైక్య రాష్ట్రంలో మహిళా పొదుపు సంఘాలు (డ్వాక్రా) ‘అభయహస్తం’ పథకం కింద

Update: 2022-03-12 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సమైక్య రాష్ట్రంలో మహిళా పొదుపు సంఘాలు (డ్వాక్రా) 'అభయహస్తం' పథకం కింద దాచుకున్న సొమ్మును తెలంగాణ ప్రభుత్వం వాపసు చేయాలనుకుంటున్నది. మహిళల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం అనివార్యమైంది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న సుమారు 21 లక్షల మంది కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం 'అభయహస్తం' పథకం కింద అప్పట్లో డబ్బులు దాచుకున్నారు. ప్రతీ నెలా రూ. 500 చొప్పున పింఛను అందించడం ఈ పథకం లక్ష్యం. తెలంగాణ ఏర్పడేనాటికి (2014-15) ప్రీమియం రూపంలో మహిళలు సుమారు రూ. 282.38 కోట్ల మేర చెల్లించారు. ప్రభుత్వం కూడా కో-కంట్రిబ్యూషన్ పేరుతో రూ. 254.98 కోట్లను జమ చేసింది. ప్రస్తుతం ఈ డబ్బు మొత్తం 'సెర్ప్' దగ్గరే ఉన్నది. వడ్డీతో సహా కలిపి మొత్తం రూ. 1,075.24 కోట్లు ఉన్నట్లు డైరెక్టర్ జనవరి 12వ తేదీన లిఖితపూర్వకంగా తెలియజేశారు.

ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శనివారం అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆ శాఖల అధికారులతో సమీక్షించారు. రెండు మూడు రోజుల్లోనే మహిళలకు 'అభయహస్తం' పథకం కింద రావాల్సిన డబ్బును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. వారికి చెల్లించిన నిధులను వాపస్ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలకు 'ఆసరా' పథకం కింద తొలి నాళ్ళలో రూ. 1000 చొప్పున ఇచ్చిందని, ఇప్పుడు రూ. 2,016 చొప్పున ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో హరీశ్‌రావు పేర్కొన్నారు. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నందున మహిళలు గతంలోని 'అభయహస్తం' పథకం కింద దాచుకున్న డబ్బులను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. వారి కోరిక మేరకు ఆ నిధులను వారికే తిరిగి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

డ్వాక్రా సంఘాల ద్వారా మ‌హిళ‌లు పొదుపు చేసుకున్న రూ. 545 కోట్లు ప్రస్తుతం పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) దగ్గరే ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ వడ్డీతో సహా కలిపి ఇప్పుడు ఈ నిధులు రూ. 1,075.24 కోట్లుగా ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు. మంత్రి హరీశ్‌‌రావు సమీక్ష అనంతరం అధికారులు మొత్తం నిధులను (వడ్డీతో సహా) మహిళల ఖాతాల్లో జమ చేస్తారా లేక రూ. 545 కోట్లను మాత్రమే వాపస్ చేస్తారా అనే స్పష్టత కరువైంది. వారం రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలు 'అభయహస్తం' పథకం కింద దాకుచున్న సొమ్ము ఎనిమిదేళ్ళుగా పోగుపడి ఉన్నదని, వారు చెల్లించిన రూ. 282.38 కోట్లతో పాటు ప్రభుత్వం తన వాటాగా రూ. 254.98 కోట్లు జమ చేసిందని పేర్కొన్నారు.

దీనంతటికి వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ. 1,075.24 కోట్లకు చేరుకున్నదని, ఈ మొత్తాన్ని మహిళలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం డబ్బును తిరిగి ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News